- Home
- Entertainment
- దళపతి విజయ్ కి కోర్టులో ఎదురుదెబ్బ... జన నాయగన్‌కు సెన్సార్ కష్టాలు, నెక్స్ట్ ఏంటి?
దళపతి విజయ్ కి కోర్టులో ఎదురుదెబ్బ... జన నాయగన్‌కు సెన్సార్ కష్టాలు, నెక్స్ట్ ఏంటి?
జన నాయగన్ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో విజయ్ దళపతికి ఎదురు దెబ్బ తగిలింది. సెన్సార్ పూర్తి చేయాలని కోరిన కేసులో చిత్ర బృందానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇక జననాయగన్ టీమ్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు?

జన నాయగన్ సినిమాకు సెన్సార్ సమస్య..
జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని, వెంటనే జారీ చేయాలని కోరుతూ జనవరి మొదటి వారంలో కేవీఎన్ సంస్థ చెన్నై హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి ఆశా, వెంటనే జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు చెన్నై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది.
విజయ్ సినిమాకు వరుస అడ్డంకులు..
జనవరి 20న విచారణకు వచ్చిన ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈరోజు (జనవరి 27) తీర్పు ఇచ్చారు. సెన్సార్ బోర్డుకు తగినంత సమయం ఇవ్వకుండా సింగిల్ జడ్జి ఆశా తీర్పు ఇచ్చారని పేర్కొంటూ, ఆమె ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడానికి సమయం ఇచ్చింది. ఈ కేసును మళ్లీ సింగిల్ జడ్జి ఆశానే విచారిస్తారని ఆదేశించింది. ఈ తీర్పుతో జన నాయగన్ సినిమా విడుదలకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి.
చీఫ్ జస్టిస్ తీర్పులో ఏముందంటే?
మతపరమైన గుర్తులను అవమానించడాన్ని అంగీకరించలేమని చీఫ్ జస్టిస్ అన్నారు. జన నాయగన్ సినిమాను రివిజన్ కమిటీకి పంపకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఆదేశించడం, సెన్సార్ బోర్డు నుంచి వివరణ తీసుకోకపోవడం వల్ల ఆ ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా, ఈ కేసును మొదటి నుంచి విచారించాలని సింగిల్ జడ్జి బెంచ్‌ను ఆదేశించారు.
జన నాయగన్ టీమ్ సుప్రీం కు వెళ్తుందా?
జన నాయగన్ సినిమాను సెన్సార్ బోర్డు రివిజన్‌కు పంపిస్తే, కమిటీని ఏర్పాటు చేయడానికే రెండు వారాలకు పైగా పడుతుంది. ఆ తర్వాత రివిజన్ పూర్తయి సినిమా విడుదల కావడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఇంతలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తే, ఎన్నికలు ముగిసే వరకు సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో జన నాయగన్ సినిమా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. చీఫ్ జస్టిస్ ఆదేశాలను సవాలు చేస్తూ చిత్ర బృందం సుప్రీంకోర్టుకు వెళ్తుందో లేదో వేచి చూడాలి.

