అల్లు అర్జున్ అరెస్ట్ వెనక పొలిటికల్ రివేంజ్ ఉందా?, కేటీఆర్ ట్వీట్ దుమారం ?
అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల రాజకీయ ప్రమేయం ఉందా? ప్రతీకార చర్యలు ఉన్నాయా? కేటీఆర్ తోపాటు ప్రతిపక్షాలు స్పందనలు, బన్నీ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన విసయాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు, యావత్ ఇండియాని కలవరానికి గురి చేస్తుంది. `పుష్ప 2` సినిమాతో ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్నాడు అల్లు అర్జున్. `పుష్ప రాజ్‌గా ఆయన థియేటర్లలో హంగామా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన వివాదంలో ఇరుక్కోవడం షాకింగ్‌గా మారింది. `పుష్ప2` సినిమా ప్రీమియర్స్ రోజు (డిసెంబర్ 4 రాత్రి) అభిమానుల సమక్షంలో ఆర్‌టీసీ ఎక్స్ రోడ్‌లో సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సినిమా చూసిన విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ లో ఊపు తెచ్చేందుకు ఆయన ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్‌కి వెళ్లారు. అయితే బన్నీ రాకతో భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఆర్‌టీసీ ఎక్స్ రోడ్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంధ్య థియేటర్‌కి భారీగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు ఆమె కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితులకు రూ.25 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించారు బన్నీ.
కానీ దీనిపై మృతిరాలి భర్త కేసు నమోదు చేశాడు. తన భార్య మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఇందులో అల్లు అర్జున్ పేరుని కూడా మెన్షన్ చేయడం గమనార్హం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే సంధ్య థియేటర్ హోనర్‌ని, మేనేజర్‌ని అరెస్ట్ చేశారు.
ఈ రోజు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్ట్ లో బన్నీని హాజరుపరుస్తారు. దీంతోపాటు తన అరెస్ట్ ని సోమవారానికి వాయిదా వేయాలని బన్నీ హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. దీనిపై సాయంత్రం విచారణ జరగబోతుంది.
ఈ క్రమంలో బన్నీపై పోలీసులు కేసు నమోదు చేసిన తీరు చర్చనీయాంశం అవుతుంది. అనేక అనుమానాలకు తావిస్తుంది. బన్నీ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన ప్రమేయం ఉండదని, తాను జోక్యం చేసుకోను అని, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు.
మరో వైపు కేటీఆర్ స్పందించారు. జాతీయ అవార్డు విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని తెలిపారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ నిజంగా విఫలమయ్యింది ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు.
అల్లు అర్జున్‌ని ఒక సాధారణ నేరస్థుడిగా ప్రత్యేకంగా అతను నేరుగా బాధ్యత వహించని విషయానికి అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. ప్రభుత్వ చర్యను ఆయన ఖండించారు. అదే సమయంలో అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే, హైదరాబాద్‌లో హైడ్రా చేసిన భయం వల్ల ఇద్దరు అమాయకులు మరణించారు.
వారి మరణానికి కారణమైన సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేయడం దుమారం రేపుతుంది. దీనిపై బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు.
allu arjun arrest
బన్నీపై చిక్కడపల్లి పోలీసులు బీఎన్ఎస్ 118(1), బీఎన్‌ఎస్ 105 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటి ప్రకారం నేరం రుజువైతే బన్నీకి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో బన్నీ భవితవ్యంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నాంపల్లి కోర్ట్ తీర్పు ఇప్పుడు కీలకంగా మారింది. బన్నీని పోలీసుల రిమాండ్‌కి తరలించే అవకాశం ఉంది. ఇదే జరిగితే 14 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది.
ఈ వివాదంపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నారు ప్రతిపక్షాలు, బన్నీ అభిమానులు. ప్రభుత్వం తన వైఫల్యాలకు అమాయకులను బలి చేస్తుందంటున్నారు. దీంట్లో మరోవాదన కూడా వినిపిస్తుంది. సీఎం ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ప్రభుత్వ ప్రతీకార చర్యనా అంటున్నారు. ఎందుకంటే ఇటీవల `పుష్ప 2` థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారు. అయితే మాట్లాడి మాట్లాడి గొంతు తడారి పోయిందని, వాటర్ అడిగారు బన్నీ. కానీ ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తులేకనే అలా చేశారనేది అంతా మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో తనకు జరిగిన అవమానంపై, ఒక స్టేట్ సీఎం పేరే గుర్తు లేదా అనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బన్నీ అరెస్ట్, ఆయన్ని కోర్టుకి తరలించడం చూస్తుంటే పరోక్షంగా ప్రభుత్వం నుంచి, సీఎం నుంచి పొలిటికల్ రివేంజ్‌లాగానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి ఇందులో నిజ నిజాలేంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వివాదం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్‌కి, క్రేజ్‌కి, స్టార్ డమ్‌కి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. అంతేకాదు థియేటర్లలో రన్ అవుతున్న `పుష్ప 2` సినిమాపై కూడా ప్రభావం పడబోతుందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
read more:బిగ్ షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్ .. అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు