‘ఒప్పెన్ హైమర్’:ఇవి తెలిస్తే .. సినిమా తేలిగ్గా అర్దమవుతుంది
సాధారణంగా నోలన్ సినిమాలు ఓ పట్టాన అర్దంకావు. వాటి బ్యాక్ గ్రౌండ్ కొంచెం తెలుసుకుని వెళ్తే తేలిగ్గా అర్దమవుతుంది. అందుకు గూగుల్ చేసి మరీ వెళ్తూంటారు కొందరు అభిమానులు
విచిత్ర కథల... వెండితెర మెజీషియన్ గా క్రిస్టఫర్ నోలన్ ని ప్రపంచం గుర్తించింది. హాలీవుడ్‌లో సుప్రసిద్ధ దర్శకుడు ఆయన ఈయన సినిమాలు ఓ పట్టాన అర్దంకావు. ‘మెమెంటో’ (మన ‘గజిని’ సినిమాకు మూలం ఇదే), ‘బ్యాట్‌మన్ బిగిన్స్’, ‘ది డార్క్ నైట్’, ‘ఇన్‌సెప్షన్’,టెనెట్ లాంటి అపురూప చిత్రాలను అందించింది ఆయనే. మన ఊహకు అందని చోట ఆయన దృష్టి పడుతుంది. తన అద్భుతమైన ఊహాశక్తితో మానవ మేధకు ఓ పట్టాన అంతు చిక్కని కథాంశాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రతి సినిమా ఒక పజిల్... కానీ, ఆయన సినిమా రిలీజ్ అవుతోందంటే ఓ వర్గం ప్రేక్షకులకు యమ క్రేజ్. ఆయన సినిమా లేటెస్ట్ గా ఈ రోజు రిలీజైంది. 2020లో టెనెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోలాన్.. మూడేళ్ల తర్వాత ఈ ఓపెన్‌హైమర్ తో మాయ చేసాడు. సాధారణంగా నోలన్ సినిమాలు ఓ పట్టాన అర్దంకావు. వాటి బ్యాక్ గ్రౌండ్ కొంచెం తెలుసుకుని వెళ్తే తేలిగ్గా అర్దమవుతుంది. అందుకు గూగుల్ చేసి మరీ వెళ్తూంటారు కొందరు అభిమానులు.
2023లో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఏదీ అంటే ‘ఒప్పెన్ హైమర్’అనే చెప్పాలి. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన నాటి నుంచే క్రేజ్ నెలకొని ఉంది. ప్రముఖ భౌతికశాస్త్ర నిపుణుడు, అణుబాంబు సృష్టికర్తగా పేరుగాంచిన జె. రాబర్ట్ ఒప్పెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీసారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించిన ఈ చిత్రం ఎలా ఉంది. అసలు ఈ చిత్రం కథేంటి..సామాన్య ప్రేక్షకుడుకి అర్దమయ్యే రీతిలోనే కథ,కథనం నడిచాయా అనేది చూద్దాం.
పులిట్జర్ బుక్ అవార్డ్ పొందిన నవల `అమెరికన్ ప్రోమేథియస్` ని రైట్స్ తీసుకుని ఈ సినిమా చేసారు. ఇది పూర్తిగా జె. రాబర్ట్ ఒప్పెన్ హైమర్ బయోపిక్. అది సెకండ్ వరల్డ్ వార్ టైమ్. అప్పుడు అమెరికాకు అణుబాంబు ఓ అవసరం. దాంతో మెక్సికో ఎడారిలో అమెరికా న్యూక్లియర్ టెస్ట్ ప్రాజెక్టు చేపడుతుంది. శత్రు దేశాలని భయపెట్టాలన్నా, ఎదుర్కోవలన్నా అణుబాంబు అవసరం. బాంబుని తయారు చేసి టెస్ట్ చేసి తమ సత్తా చూపాలనేది ఆ ప్రాజెక్టు టార్గెట్. అప్పుడే సీన్ లోకి ఒప్పెన్ హైమర్ వస్తాడు. అతను స్టూడెంట్ గా ఉన్నప్పుడే జీనియర్. థీరిటికల్ ఫిజిసిస్ట్, న్యూక్లియర్ ఫిజిక్స్ లో నెంబర్ వన్ సైంటిస్ట్ గా పేరు తెచ్చుకున్నవాడు. అతన్ని మించిన వారు ఎవరు..దాంతో అతన్నేఆ వినాసకర ప్రాజెక్ట్ లోకి తీసుకువస్తారు.ప్రాజెక్ట్ లాస్ అలోమోస్ లేబొరేటరీ కి డైరెక్టర్ గా అపాయింట్ అవుతాడు.
ఈ ల్యాబ్ నుండి న్యూక్లియర్ ఆయుధాలను తయారు చెయ్యడమే లక్ష్యం గా ముందుకు వెళ్తుంది. అయితే అక్కడా అతనికి శత్రువులు ఉంటారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి. మరో ప్రక్క ఆటంబాంబును విజయవంతంగా పరీక్షించిన తర్వాత, ఇది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుందని ఒప్పెన్‌హైమర్ తీవ్రంగా కలత చెందేవారు. దాన్ని ఎలా అధిగమించేవాడు. ఇక1945లో మెక్సికో ఎడారిలో ..ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్.. ఎలా జరిగింది.. ఒప్పెన్ హైమర్ తన శత్రువైన లూయీస్ ఫాస్ ని ఎదుర్కొన్నాడు. ఆయన జీన్ థాట్ లాబ్ తో అక్రమ సంభందం ఎందుకు పెట్టుకున్నాడు.. అలాగే అతని జీవితంలో భార్య కిట్టీ పాత్ర ఏమిటి..ఇవే ఎలిమెంట్స్ చుట్టూ కథ,కథనం తిరుగుతుంది.
ఇలాంటి కాంప్లికేటెడ్ లైఫ్ కు చెందిన బయోపిక్ లు తీయటం అంత ఈజి కాదు. అందులోనూ అణుబాంబు తయారి గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్ గురించి తెరపై చెప్పి తీరాలి. అది ఎంతవరకూ అర్దమవుతుందో తెలియదు. ఇవి నోలన్ ముందు ఉన్న సవాళ్లు. అయితే వీటిని ఆయన అధిగమించే ప్రయత్నం చేసినట్లు కనపడదు. తను అనుకున్నది అనుకున్నట్లు తీసుకుంటూ వెళ్లిపోయారు. ఆయన సినిమాలపై రెగ్యులర్ గా ఓ కంప్లైంట్ ఉంది. అవి ఒకసారి చూస్తే అర్దంకావు..రెండు మూడు చూస్తే కానీ కనెక్ట్ కాలేము. వేరే లెవిల్ ఐక్యూ అవసరం అంటూంటారు ఆయన అభిమానులు.
Oppenheimer Movie
ఈ సినిమాలో సంఘటనల కన్నా డైలాగ్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. సైన్స్ , ముఖ్యంగా ఫిజిక్స్ మీదా అవగాహన ఉన్నవాళ్లకు పూర్తిగా అర్దమవుతాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలులాగ..మధ్య మధ్యలో సెల్ లో మెసేజ్ లు చెక్ చేసుకుంటూ చూస్తే అర్దమయ్యే సినిమా కాదది. ఆటంబాబు పేలాక ..గవర్నమెంట్ నుంచి ఎదుర్కొనే ఒత్తిడిలు ఎదుర్కొన్నాడు అనేది కూడా నీట్ గా చూపించారు. హీరోషిమా, నాగసాకి మీద అణుబాంబు వేసాక తను ఎంత పెద్ద తప్పు చేసాడో ...ఎలా ఫీలయ్యాడు అనేది విషయమై బాగా దృష్టి పెట్టారు నోలన్. నేనే చావును అయ్యాను..నేనే ప్రపంచాన్ని సర్వ నాశనం..చేస్తాను అంటూ హైమర్ చెప్పే డైలాగులు వింటూంటే మనపై బాంబు పేలిన ఫీలింగ్ వస్తుంది.
హైమర్ పాత్రలో కనిపించిన సిలియన్ మర్ఫీ ఖచ్చితంగా ఆస్కార్ కు నామినేట్ అవుతారు. అలాగే ఒప్పెన్ హైమర్ కు ప్రధాన శత్రువు..అటమిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ లూయీస్ ఫాస్ పాత్రలో ఐరన్ మ్యాన్ రాబర్ట్ డౌనీ జూనియర్ అదరకొట్టారు. మాన్ హట్టన్ ప్రాజెక్టుని కాపాడుకుంటూ వచ్చే విభిన్నమైన పాత్రలో మ్యాట్ డామన్ కనపడతాడు.
కాస్ట్యూమ్స్ డిజైన్ అద్బుతంగా ఉంది. బాంబింగ్ సీన్స్ ని అయితే అసలు తెరపై ఇంత రియల్ గా ఎవరూ తీయలేరమో అనిపిస్తుంది. ఒళ్లు గగుర్పొస్తుంది.ఇంత డైలాగులు తో నడిచే ఈ సినిమాని ఎడిటర్ నిలబెట్టాడనే చెప్పాలి. ఫస్టాఫ్ సీన్స్ రేసీగా పరుగెట్టడం గమనించవచ్చు. ఇదొక హిస్టారికల్ సైకో డ్రామా ..దీన్ని నోలన్ మాత్రమే తీయగలరు...ఆయన అభిమానులు ఓపిగ్గా చూడగలరు..మామూలు ప్రేక్షకులకు కొంచెం ఇబ్బందే పెడుతుంది. బాంబ్ పేలే సీన్ లో సౌండ్ డిజైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.