ఎన్టీఆర్ వదులుకునన్న బ్లాక్ బస్టర్ చిత్రాల లిస్ట్... చేసుంటే ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడ ఉండేదో!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఆయన ఒకరిగా ఉన్నారు. నందమూరి నటవారసుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, తాతకు తగ్గ మనవడు అనిపించాడు. అతి తక్కువ కాలంలో మాస్ హీరోగా ఎదిగిన హీరో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్... స్టూడెంట్ నంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో 2003 నాటికి స్టార్ హీరో అయ్యారు. అద్భుత నటన, నృత్యం, డైలాగ్ డెలివరీ ఎన్టీఆర్ ని ఆ స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఎన్టీఆర్ కొన్ని సూపర్ హిట్ చిత్రాలను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఎన్టీఆర్ ఖాతాలో పడితే ఎన్టీఆర్ టాలీవుడ్ నంబర్ వన్ గా టాప్ పొజిషన్ లో ఉండేవారు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆ చిత్రాలేమిటో చూద్దాం..
మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం శ్రీమంతుడు. 2015లో విడుదలైన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మిర్చితో హిట్ కొట్టి ఊపుమీదున్న కొరటాల శివ.. శ్రీమంతుడు కథ ఎన్టీఆర్ తో చేద్దామనుకున్నారట. కొరటాలను కాదని పూరితో టెంపర్ చేసిన ఎన్టీఆర్.. జస్ట్ హిట్ అందుకున్నారు.
నితిన్ హీరోగా దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన మాస్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్. నితిన్ రెండో చిత్రంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. నిజానికి మొదట వినాయక్.. ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన వద్దనుకున్నారట. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ సింహాద్రి మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
దర్శకుడు సుకుమార్ డెబ్యూ మూవీగా తెరకెక్కింది ఆర్య. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆర్య అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపింది. బన్నీకి ఆర్య రెండవ చిత్రం కాగా.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కథను సుకుమార్ మొదట ఎన్టీఆర్ కి చెప్పారట, కారణం ఏదైనా ఎన్టీఆర్ ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో పూరితో ఆంధ్రావాలా మూవీ చేసి ఎన్టీఆర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు.
2005లో విడుదలైన భద్ర సూపర్ హిట్ కొట్టింది. దర్శకుడు బోయపాటి డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం రవితేజకు భారీ హిట్ కట్టబెట్టింది. భద్ర కథకు బోయపాటి మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ అట. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఆయన రవితేజతో చేశారు. ఆ ఏడాది ఎన్టీఆర్ చేసిన అల్లరి రాముడు, నరసింహుడు పరాజయం పొందాయి.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటి హిట్ అతనొక్కడే. దర్శకుడు సురేంధర్ రెడ్డి డెబ్యూ మూవీ కాగా, రివేంజ్ డ్రామాగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఈ కథకు కూడా దర్శకుడు ఛాయిస్ ఎన్టీఆర్ కావడం విశేషం. కొత్త దర్శకుడు కావడంతో ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ తో ఆయన చేసిన అశోక్, ఊసరవెల్లి విజయం సాధించలేదు.
రవితేజను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాలలో కృష్ణ ఒకటి. దర్శకుడు వి వి వినాయక్ తెరకెక్కించిన ఆ మూవీ 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వినాయక్ తన మిత్రుడైన ఎన్టీఆర్ తో కృష్ణ మూవీ చేద్దాం అనుకున్నారట. ఇక ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన కంత్రి ప్లాప్ గా నిలిచింది.
రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఉంది కిక్. భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ చిత్రం అలరించింది. ఆ చిత్ర దర్శకుడు సురేంధర్ రెడ్డి మొదట ఎన్టీఆర్ తో కిక్ చేయాలనుకున్నారట. కారణం ఏమిటో కానీ అది కుదరలేదు. 2009లో ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.