- Home
- Entertainment
- `ఇండియానా జోన్స్` రేంజ్‌లో `హరిహర వీరమల్లు`, హైప్ ఇచ్చిన నిర్మాత.. ఆ కష్టం మాత్రం వర్ణణాతీతం
`ఇండియానా జోన్స్` రేంజ్‌లో `హరిహర వీరమల్లు`, హైప్ ఇచ్చిన నిర్మాత.. ఆ కష్టం మాత్రం వర్ణణాతీతం
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన `హరిహర వీరమల్లు` మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా `ఇండియానా జోన్స్` రేంజ్‌లో ఉంటుందన్నారు నిర్మాత.

`హరిహర వీరమల్లు` మూవీపై బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్
`హరిహర వీరమల్లు` హాలీవుడ్ మూవీ `ఇండియానా జోన్స్` రేంజ్‌లో ఉంటుందని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. ఆయన భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం `హరిహర వీరమల్లు`. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో సాగుతుంది.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. మొదట క్రిష్ జాగర్లమూడి కొంత భాగం రూపొందించగా, దర్శకుడు జ్యోతికృష్ణ మిగిలిన సినిమాని పూర్తి చేసే బాధ్యతలను తనపై వేసుకున్నారు.
ఎట్టకేలకు ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది. ఆడియెన్స్ లో బజ్ క్రియేట్ అయ్యింది.
17వ శతాబ్దం కథతో `హరిహర వీరమల్లు`
ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఆయన మాట్లాడుతూ, `17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు.
ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ ఈ కథని డిజైన్ చేశాం. `హరి హర వీరమల్లు` పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.
మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ.
ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే ఎక్కువ మందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది. రెండు భాగాలు చేయాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినా షూటింగ్ ఈజీ కాదు
నేను 'భారతీయుడు' సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు.
అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి.
నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను `హరి హర వీరమల్లు` ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది` అని తెలిపారు ఏఎం రత్నం.
పవన్ కళ్యాణ్ తో 25ఏళ్ల అనుబంధం
పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ, `ఖుషి`, `బంగారం` తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన మూడో చిత్రమిది. మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. మంచి ఆశయాలున్న మనిషిగా ఆయనంటే నాకిష్టం.
సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. `ఖుషి` ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు.
సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. `హరి హర వీరమల్లు`లో కూడా ఆయన ఇన్ పుట్స్ చాలా ఉన్నాయి. ఇన్‌స్పైర్ చేసే విషయాలున్నాయి. అయితే పవన్ ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడు. ఆయన నటిస్తున్న సినిమా అంటే ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది.
ఆ ఒత్తిడిని బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. వారి అభిమానులతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది` అని చెప్పారు నిర్మాత.
పవన్ సపోర్ట్ చేయకపోతే సినిమానే లేదు
పవన్ ఈ మూవీకి అందించిన సహకారం గురించి నిర్మాత రత్నం మాట్లాడుతూ, `పవన్ కళ్యాణ్ సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ అంటే నాకెంత ఇష్టమో, నేనంటే కూడా ఆయనకి ఇష్టం. టీం అందరి సహకారంతో ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము.
అయితే షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టమైంది. సడెన్‌గా ఓసారి పవన్ డేట్స్ ఇచ్చారు. అప్పటికి సెట్ లేదు. దీంతో వేరే సినిమా సెట్‌లో షూట్ చేయాల్సింది. రాత్రికి రాత్రి సెట్ కలర్ మార్చడం పెద్ద సవాల్ అయ్యింది.
మరో రోజు నాజర్ డేట్స్ అందుబాటులో లేవు, దీంతో ఆయన్ని కన్విన్స్ చేయడం మరో టాస్క్. దీంతోపాటు మరో రోజు పీటర్ హెయిన్స్ యాక్షన్ చేయాల్సింది. ఆయన్ని పట్టుకోవడం మరో టాస్క్ అయ్యింది. ఇలాంటివి చాలానే ఉన్నాయి.
ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తూ వచ్చాను, ఎందుకురా ఇన్ని బాధలు అని ఎప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది` అని అన్నారు రత్నం. ఈ మూవీ షూటింగ్ విషయంలో నిర్మాత కష్టం వర్ణణాతీతం అని ఆయన తన మాటల్లో వెల్లడించారు.
`ఇండియానా జోన్స్` రేంజ్‌లో `హరిహర వీరమల్లు`
ఇక ఫైనల్‌గా తన కొడుకు జ్యోతికృష్ణ గురించి చెబుతూ, సినిమాపై హైప్ ఇచ్చారు. ఈ మూవీని `ఇండియానా జోన్స్` రేంజ్‌లో రూపొందించాడని, జ్యోతిలో ఇంత టాలెంట్ ఉందని తాను ఊహించలేదన్నారు.
ఆయన చెబుతూ, మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. `ఇండియానా జోన్స్` తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు.
సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించారు. సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లాడు. అది రేపు థియేటర్లో చూసిన ఆడియెన్స్ కి తెలుస్తుంది` అని చెప్పారు నిర్మాత రత్నం.