- Home
- Entertainment
- Giribabu: రఘుబాబు నటించిన చిత్రాల్లో గిరిబాబుకి ఇష్టమైనవి ఇవే.. తీరని కోరిక ఏంటంటే?
Giribabu: రఘుబాబు నటించిన చిత్రాల్లో గిరిబాబుకి ఇష్టమైనవి ఇవే.. తీరని కోరిక ఏంటంటే?
సీనియర్ నటుడు గిరిబాబు తన ఇద్దరు కుమారులు రఘుబాబు, బోస్బాబుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రఘుబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అభిప్రాయాన్ని రివర్స్ చేశాడని వెల్లడించారు.

కొడుకుల గురించి గిరిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
విలక్షణ నటుడు గిరిబాబు ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన శనివారం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన తన కొడుకుల గురించి పలు ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రఘుబాబు నటించిన చిత్రాల్లో ఇష్టమైన మూవీస్ గురించి, అలాగే ఆయన తన అభిప్రాయాన్ని రివర్స్ చేసిన విషయాన్ని, బోస్ బాబుతో తీసిన సినిమాల గురించి వెల్లడించారు.
రఘుబాబు నటనపై గిరిబాబుకి ప్రత్యేకమైన అభిమానం
గిరిబాబు పెద్ద కుమారుడు రఘుబాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు. ముఖ్యంగా కామెడీ, విలనిజం, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో సినిమాల్లో మెప్పించారు. అయితే రఘుబాబు కెరీర్లో కొన్ని పాత్రలు తండ్రి గిరిబాబుకు ప్రత్యేకంగా నచ్చాయట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’, అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ సినిమాల్లో రఘుబాబు పోషించిన పాత్రలు తనకు చాలా ఇష్టమని గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నత్తి పాత్రలు బాగా ఇష్టపడతానని, వాటిలో రఘుబాబు కామెడీ బాగుంటుందని చెప్పారు. రఘుబాబు విలన్గా కనిపిస్తూనే కామెడీ చేస్తాడని, అలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ఆ విషయంలో రఘుబాబు బాగా నచ్చుతాడని తెలిపారు.
‘ఆది’ సినిమాలో రఘుబాబు పోషించిన గంగిరెడ్డి పాత్ర ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ పాత్రలో ఆయన చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బన్నీ’ సినిమాలోనూ తనదైన నటనతో మెప్పించారు. ఈ రెండు సినిమాలు రఘుబాబు కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తండ్రిగా గిరిబాబు కూడా కొడుకు నటనను ఎంతో ఇష్టపడేవారని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
బోస్బాబును హీరోగా చూడాలన్నది తండ్రి కోరిక
ఇక గిరిబాబు రెండో కుమారుడు బోస్బాబు విషయానికి వస్తే.. ఆయనను హీరోగా పరిచయం చేయాలన్నది గిరిబాబు ఆశయం. అందుకోసం 1990లో ‘ఇంద్రజిత్’ అనే కౌబాయ్ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించారు. ఇది ఆడలేదు. బోస్బాబును హీరోగా నిలబెట్టేందుకు గిరిబాబు ఎంతో కష్టపడ్డారు.
ఆ తర్వాత ‘నిమజ్జనం’, ‘చెమ్మచెక్క’, ‘స్టంట్ మ్యాన్’ వంటి సినిమాల్లోనూ బోస్బాబు నటించారు. అయితే ఆశించిన స్థాయిలో హీరోగా అవకాశాలు, విజయాలు రాకపోవడంతో క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన సీరియల్స్ చేస్తున్నారు. బుల్లితెరపై బిజీగా ఉన్నట్టు సమాచారం.
బోస్బాబు విషయంలో గిరిబాబుకు ఒక తీరని కోరిక మిగిలిపోయింది. తన చిన్న కుమారుడిని హీరోగా నిలబెట్టలేకపోయాననే బాధను ఆయన గతంలో ఇంటర్వ్యూల్లో వ్యక్తం చేశారు. మరోవైపు పెద్ద కుమారుడు రఘుబాబు మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని పరిశ్రమలో కొనసాగారు.
తన ప్లాన్ రివర్స్ చేసిన రఘుబాబు
ఒక తండ్రిగా గిరిబాబు ఇద్దరు కుమారుల సినీ ప్రయాణాలను దగ్గరగా చూశారు. ఒకరు నటుడిగా నిలదొక్కుకుని ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటే, మరొకరు హీరోగా ఎదగాలన్న ప్రయత్నంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. రఘుబాబు నటనలోని ప్రతిభను గుర్తించి, తనకు నచ్చిన పాత్రలను ప్రత్యేకంగా ప్రస్తావించడం గిరిబాబుకు కొడుకుపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది.
ఇదిలా ఉంటే రఘుబాబు నటుడు అవుతాడని తాను అనుకోలేదట. బోస్బాబు సినిమాల్లో రాణిస్తాడు, హీరో అవుతాడని అనుకున్నాడట. కానీ రఘుబాబు నిర్మాత అవుతాడని, వ్యాపారాలు చూసుకుంటాడని భావించాడట. కానీ అనూహ్యంగా రఘుబాబు నటుడిగా మారాల్సి వచ్చిందని, తను ఇంత పెద్ద స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాడని ఊహించలేదని, అతని విషయంలో హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు గిరిబాబు.













