‘పుష్ప రాజ్’ అవతారంలో వినాయకుడి విగ్రహాలు.. దేవుడితో ఆటలొద్దు.. నెటిజన్ల ఫైర్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటించిన చిత్రం ‘పుష్ఫ’. ఈచిత్రంలోని ‘పుష్ప రాజ్’ మేనరిజం ఆడియెన్స్ పై ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. తాజాగా గణేశ్ చతుర్థి వేడుకల్లోనూ ‘పుష్ఫ’ క్రేజ్ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
దేశవ్యాప్తంగా నేడు గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi) వేడుకలు ప్రారంభమయ్యాయి. హిందువులు తమ ఇళ్లలో, మండపాల్లో గణేష్ మహారాజ్ కు స్వాగతం పలుకుతూ.. విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ప్రత్యేక పూజలతో స్వామి వారిని ధ్యానించారు. అయితే ఈ సినిమా ప్రభావం చివరకు గణేశ్ వేడుకలపైనా పడటం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ ‘పుష్ఫ రాజ్’ (Pushpa Raj)గా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పుష్ఫ’తో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ కు ఐకాన్ స్టార్ క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ఇంపాక్ట్ ప్రతి రంగంపైనా పడుతోంది. ‘పుష్ఫ’ టైటిల్, పోస్టర్లు ఏదోరకంగా నిత్యం ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
ఇప్పటికే రాజకీయ నాయకులు, క్రికెటర్స్ ‘పుష్ఫ రాజ్’ మేనరిజాన్ని ఫాలో అవడం చూశాం. అలాగే మార్కెట్ లోకి ‘పుష్ఫ’టీ షర్ట్స్, షర్ట్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ‘పుష్ఫ రాజ్’ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే పుష్ఫ రాజ్ అవతారంలో గణేశ్ విగ్రహాలను తయారు చేయడం, వాటిని పూజించడం ఆసక్తికరంగా మారింది.
పుష్ఫ రాజ్ అవతారంలోని గణనాథుడి కొన్ని ప్రతిమలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. లుంగీ, టీషర్లలో కూర్చొని ఉన్నట్టుగా, వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పుష్ఫ రాజ్ అవతార్ గా గణేష్ విగ్రహాలను రూపొందించారు. అయితే ఈ విగ్రహాలను తయారు చేయడం పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఆ విగ్రహాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అల్లు అర్జున్ అంటే తమకు చాలా ఇష్టమేనని, కానీ దేవుడితో ఆటలొద్దు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదీ ఏమాత్రం సరికాదని, వెంటనే పోస్టును తొలగించండి’ అంటూ డిమాండ్ చేశారు.
మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఈ విగ్రహాల ఫొటోలను ఇంటర్నెట్ లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రతి వినాయక చవితికి అల్లు అర్జున్ నటించిన పాత్రలకు సంబంధించిన వినాయకుడి విగ్రహాలు రాకుండా వేడుకలు ముగియవంటున్నారు. గతంలో నాపేరు సూర్యనా ఇల్లు ఇండియా, సరైనోడు, డీజే, గోనగన్నారెడ్డి అవతారంలో రాగా.. ఈసారి ‘పుష్ఫ రాజ్’గా అవతరించాడని అంటున్నారు. తమ అభిమాన హీరోను దేవుడితో సమానంగా పూజిస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.