Gamanam Review: శ్రియా `గమనం` మూవీ రివ్యూ
హీరోయిన్ శ్రియా చాలా గ్యాప్ తో `గమనం` అనే ఓ డిఫరెంట్ సినిమాతో, బలమైన పాత్రతో ఆడియెన్స్ ముందుకొస్తుంది. మహిళా దర్శకురాలు సుజనా రావు తొలి ప్రయత్నంగా రూపొందించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం-డిసెంబర్ 10)న విడుదలవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన శ్రియా చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. ప్రేమ, వివాహం, పిల్లలు ఇలా ఫ్యామిలీ విషయంలో బిజీ అయిపోయింది. కెరీర్ పరంగా ఫామ్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్‌తో ఆమె మరో విభిన్న కథా చిత్రంలో నటించింది. `గమనం` అనే ఓ డిఫరెంట్ సినిమాతో, బలమైన పాత్రతో ఆడియెన్స్ ముందుకొస్తుంది. మహిళా దర్శకురాలు సుజనా రావు తొలి ప్రయత్నంగా రూపొందించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం-డిసెంబర్ 10)న విడుదలవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో(Gamanam Review) చూద్దాం.
కథః
`గమనం` సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. హైదరాబాద్ తో ఈ మూడు పాత్రలు సాగుతాయి. టైలర్‌గా పనిచేస్తున్న కమల(శ్రియా శరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఈ లోపం కారణంగానే భర్త కూడా ఆమెని వదిలేస్తాడు. టైలరింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే తన కుటుంబాన్ని, పిల్లాడిని పోషించుకుంటుంది. నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. మరోవైపు క్రికెటర్‌గా రాణించాలని శ్రమిస్తుంటాడు అలీ(శివ కందుకూరి). తనని జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంటుంది. వీళ్ళ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. అలీ కోసం జరా తన ఇంటిని, ఫ్యామిలీని వదులుకుని వస్తుంది. ఇంకో వైపు ఓ ఇద్దరు వీధి బాలురు గుజరీ సామాను అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరు తన బర్త్ డే కి కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలెబ్రెట్ చేయాలనుకుంటాడు. అందుకు కావాల్సిన డబ్బు కోసం కష్టపడుతుంటాడు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? అలీ, జరా పెళ్లి చేసుకున్నారా? వీధి బాలుడు పుట్టినరోజును గ్రాండ్ గా సెలెబ్రెట్ చేసుకున్నాడా? కమల జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
నిస్సహాయత స్థితిలో ఉన్న మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, వారి ప్రయాణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. మనల్ని మనం తెలుసుకునేలా చేసే చిత్రమిదని చెప్పొచ్చు. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఎలా జయించారనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ఇలా మూడు నిస్సహాయ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ.. గమనాన్ని ప్రేక్షకులను హత్తుకునేలా చేస్తాయి. భర్త చేతిలో మోసపోయి నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలి పాత్ర, ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుని పాత్ర, పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలల పాత్ర ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. ప్రతి జీవి జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను ఎదుర్కొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఓ స్ఫూర్తి దాయకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకురాలు సుజనా రావు.
అయితే సినిమా కాస్త స్లోగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎమోషన్స్ వాటిని డామినేట్ చేస్తుంటాయి. వినికిడి లోపం ఉన్న దివ్యంగురాలి పాత్రలో శ్రియ అభినయం అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. నటనతో మెప్పించింది. ఇకపై తాను ఇలాంటి విభిన్న కథా చిత్రాలు, బలమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్టు ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకు `గమనం`తో తొలి అడుగు పడిందని చెప్పాలి. సినిమా క్లైమాక్స్ లో బాగా చేసింది శ్రియా. యువ హీరో శివ కందుకూరి క్రికెటర్ పాత్రలో ఒదిగిపోయాడు. నటనలో కాస్త మెచ్యూరిటీని ప్రదర్శించాడు. క్లైమాక్స్ లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ప్రియాంక జవాల్కర్ ముస్లిం యువతి పాత్రలో మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలలో నిత్యామీనన్, బిత్తిరి సత్తి మెరిశారు.
దర్శకురాలు సుజనా రావుకిది తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఓ బలమైన కథని ఎంచుకుని సగం సక్సెస్ అయ్యింది. దాన్ని తెరపై ఆవిష్కరించడంలోనూ ఫర్వాలేదనిపించారు. అయితే కొన్నిసన్నివేశాల్లో అనుభవ లేమి కనిపిస్తుంది. కానీ కథ పరంగా హైదరాబాద్‌లో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో హృద్యంగా ఆవిష్కరించారు. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్. అది హృదయానికి హత్తుకునేలా ఉంది. ఉన్నది ఒక్క సాంగే అయినా దాన్ని నిత్యామీనన్ ద్వారా శాస్త్రీయ గీతంతో క్లైమాక్స్ లో కంపోజ్ చేయడం బాగుంది. విజువల్స్ ఫర్వాలేదు. ఇలాంటి చిత్రాలకు ప్రశంసలుంటాయిగానీ, కమర్షియల్‌గా ఆదరణ దక్కడం అరుదు.
ఫైనల్‌గా..
ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారం.
రేటింగ్‌ః 2.75