నిర్మాతలకు ఎగ్జిబిటర్లు షాక్, రేవంత్‌రెడ్డికి మద్దతు.. `పుష్ప 2` దెబ్బకి అంతా తలకిందులు ?
టాలీవుడ్‌లో భారీ సినిమాలు నిర్మించే నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు ఇప్పుడు ఎగ్జిబిటర్లు మద్దతు తెలియజేయడంతో పరిస్థితి అంతా తలక్రిందులుగా మారుతుంది.
`పుష్ప 2` సినిమా తెచ్చిన తంటా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దెబ్బగా మారుతుంది. ముఖ్యంగా నిర్మాతలకు పెద్ద షాకిస్తుంది. ఈ సినిమా టికెట్ రేట్లు అందరిని ఆలోచనలో పడేశాయి. సాధారణ ఆడియెన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన విషయంలో ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడం ఇకపై ఉండదని తేల్చిన చెప్పిన నేపథ్యంలో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఎగ్జిబిటర్లు కూడా సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటనని సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో బడా నిర్మాతలకు పెద్ద షాక్ ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచవద్దని వారంతా వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపు ఆడియెన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పడేస్తుందని, ఆడియెన్స్ ని సినిమాకి దూరం చేస్తుందన్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంచలన ప్రకటనలు చేశారు.
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, సినిమా టికెట్ ధరలను పెంచటం వలన ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సాధారణ సినిమాలకు కూడా పెరిగిన టికెట్ ధరలనే వసూలు చేస్తున్నారని వారు భావిస్తున్నట్లు మాకు తెలిసింది. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు పెట్టటం వలన ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు.
తొలి మూడు నాలుగు రోజుల్లో మధ్య తరగతి ఆడియెన్స్, స్టూడెంట్స్, చిన్న చిన్న పనులు చేసుకునే అభిమానులు సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. అలాంటి వాళ్ల దగ్గర నుంచి ఎక్కువ టికెట్ రేట్స్‌ను వసూలు చేయటం అనేది బాధాకరం అని తెలిపారు.
ఇంకా చెబుతూ, ఇటీవల టికెట్ రేట్స్‌ను ఏదైనా ఒక రేటుకి ఫిక్స్ చేయాలని దిల్‌రాజుని కూడా కలిశాం. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. ఆయన నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారు కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించారు. ఆయనకు కూడా మేం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
టికెట్ రేట్స్‌ను పెంచుతూ వచ్చే జీవోలను ప్రేక్షకులు సరిగ్గా గమనించరు. అదే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయని భావిస్తుంటారు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్‌పై పడుతుంది. ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచబోమంటూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో థియేటర్స్‌కు ప్రాణం పోసినట్టయ్యింది. టికెట్ రేట్స్ పెరగకుండా ఫిక్స్‌డ్‌గా ఉంటే ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాను చూసి ఆదరిస్తారు` అని అన్నారు. ఈ సందర్భంగా సీఎంకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కి ఆయన థ్యాంక్స్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్.రామ్ ప్రసాద్ ఈ విషయంపై స్పందిస్తూ, రాబోయే రోజుల్లో టికెట్ రేట్స్ పెంచబోమంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల సినీ ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం. బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ పెంచటం వద్దని చెబుతున్నాం. కొందరు నిర్మాతలు సినిమాపై ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పి రేట్స్ పెంచటం జరుగుతుంది. దీని వల్ల థియేటర్స్‌కు వచ్చే జనాలు కూడా తగ్గుతున్నారు.
Pawan Kalyan
కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లే ఏపీలోనూ బెనిఫిట్ షోస్ లేకుండా, టికెట్ రేట్స్ ఎక్కువగా పెరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామని అనుకుంటున్నాం. టికెట్ రేట్స్ పెంచటం వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకుడిపైనే ఆ భారం పడుతుంది. అలాంటి చర్యలు థియేటర్స్‌కు నష్టాన్ని కలిగిస్తాయే తప్ప.. లాభాన్ని కలిగించవు.
ఇలాంటి చర్యలు వల్ల మీడియం బడ్జెట్ సినిమాలు కలెక్షన్స్ లేక దెబ్బ తింటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీలోనూ అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తాం` అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్, ఒంగోలు ఎగ్జిబిటర్ గోరంట్ల వీరినాయుడు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్, ఈసీ మెంబర్, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
`పుష్ప 2` సినిమా తెచ్చిన వివాదం ఇప్పుడు పెద్ద సినిమాలపై గట్టి దెబ్బపడబోతుంది. టికెట్ రేట్లు లేవు, బెనిఫిట్ షోలు లేకపోవడంతో ఆయా చిత్రాల నిర్మాతలకు ఇబ్బంది తప్పదు. అత్యుత్సాహానికి, అతి ఆశకుపోయి ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.
ఇండస్ట్రీ మొత్తానికే దెబ్బ పడే పరిస్థితి వచ్చిందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. `పుష్ప 2` చిత్రానికి బెనిఫిట్ షోస్‌కి ఎనిమిది వందలు పెంచగా, మొదటి వారంలోరెండు వందలు టికెట్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే.