బెయిల్ వచ్చినా కావాలని అల్లు అర్జున్ ని జైల్లో ఉంచారా?
కోర్టు బెయిల్ ఇచ్చినా అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారని, తీర్పును దిక్కరించారనే వాదన మొదలైంది. దీనిపై అల్లు అర్జున్ తో పాటు ఆయన లాయర్లు సీరియస్ గా ఉన్నారట. సంబంధిత అధికారులపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నారట.
Allu Arjun
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జైలుకు వెళ్లే పరిస్థితి నుండి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ.. జైలు అధికారులకు అందాల్సి ఉంది. ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ని జైలులో ఉంచారు.
పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైలులో ఉంచారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ని ఇంటికి పంపాల్సి ఉంది. కానీ జైలు అధికారులు అందుకు నిరాకరించారు. ఇది కోర్టు తీర్పును దిక్కరించడమే అంటున్నారు. దీనిపై అల్లు అర్జున్ న్యాయవాదులు సీరియస్ అయ్యారట. లీగల్ యాక్షన్ కి సిద్ధం అవుతున్నారట.
ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది. జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అక్కడే ఉన్నారట. ముందుగా వారిని కలిశాడని సమాచారం. అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చాడు. అక్కడ చాలా సమయం గడిపారు.
దిల్ రాజుతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిశారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుండి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్ మీడియా ముందు వస్తాడా లేదా అనేది ఉత్కంఠగా మారింది.