- Home
- Entertainment
- 5 కోట్ల బడ్జెట్ తో 50 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?
5 కోట్ల బడ్జెట్ తో 50 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?
కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఓ చిన్న సినిమా.. 50 కోట్లు వసూలు చేసి.. భారీ లాభాలు తెచ్చింది. అంతే కాదు ఆడియన్స్ మనసులను గెలిచింది. ఇంతకీ ఏంటా సినిమా? ఓటీటీలో రిలీజ్ ఎప్పుడు? ఎక్కడా?

అలరిస్తున్న మలయాళ సినిమాలు..
ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు ఎక్కువగా ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఓటీటీల ప్రభావంతో అన్ని భాషల్లో మలయాళ సినిమాలకు ఆదరణ పెరిగిపోయింది. మంచి కథ, కాన్సెప్ట్, నటన తో ఆ సినిమాలు అన్నిభాషల ప్రేక్షకులను ఆకర్శిస్తున్నాయి. గతఏడాది అద్భుతమైన విజయాలతో మలయాళ పరిశ్రమ దేశవ్యాప్తంగా దూసుకుపోయింది... చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ పరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి. ఈ ఏడాది కూడా లోకా లాంటి సినిమాలతో అదే విజయపరంపరను కొనసాగిస్తూ మలయాళ పరిశ్రమ బలమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాంటి విజయవంతమైన సినిమాల జాబితాలో ‘ఎకో’ సినిమా ఒకటిగా నిలిచింది.
బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎకో మూవీ..
సందీప్ వినీత్, నరేన్, బినూ పప్పు, సౌరభ్ సచ్ దేవా కీలక పాత్రల్లో నటించిన ఎకో సినిమాకు దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు జయరామ్ నిర్మించగా, కథ , స్క్రీన్‌ప్లేను బాహుల్ రమేశ్ అందించారు. ముజీబ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ‘ఎకో’ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన.. ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
ఓటీటీలో ఎకో రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ?
ఈ ఏడాది చివర్లో కూడా మలయాళ సినిమా విజయ పరంపరను కొనసాగించిన చిత్రంగా ‘ఎకో’ గుర్తింపు పొందింది.థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ‘ఎకో’ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 31 నుంచి ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే తో..
ఇక ఎకో సినిమా కథ విషయానికి వస్తే, కొంతమంది వ్యక్తులు ఒక నిందితుడిని వెతుకుతూ అడవిలోని ఓ కొండ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ కొండ ప్రాంతంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, అక్కడ దాగి ఉన్న రహస్యాలు ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా కథ సాగుతుంది. మిస్టరీ , థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.థియేటర్లలో సాధించిన విజయంతో పాటు, ఇప్పుడు ఓటీటీ విడుదలతో ‘ఎకో’ సినిమా మరింతగా ప్రేక్షకుల వరకు చేరుకోనుంది. మలయాళ సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు.

