Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Duvvada Srinivas: దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో మారుమోగిపోయిన పేర్లు. వీరిద్దరూ కలిపి వకుళ సిల్క్స్ పేరుతో హైదరాబాద్ లో పెద్ద స్టోర్ ప్రారంభించారు. అది ఏడాది అవ్వకముందే సక్సెస్ అయింది.

ఏడు నెలల్లోనే సక్సెస్
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి హైదరాబాద్లోని మదీనాగూడ ప్రాంతంలో కాంచీపురం వకుళ సిల్క్స్ అనే కొత్త పట్టు చీరల షోరూంను ఈ ఏడాదే ప్రారంభించారు. కుటుంబ గొడవలతో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోంచి బయటికి వచ్చి దివ్వెల మాధురితో కలిసి నివసిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పొలిటికల్‌గా దువ్వాడ శ్రీనివాస్‌కు ఎదురు దెబ్బ తగలడంతో అతను మాధురితో కలిసి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అంతకుముందు మైనింగ్, విద్యాసంస్థలను స్థాపించిన శ్రీనివాస్ ఈసారి కొత్తగా చీరల షాపును ప్రారంభించారు. దీన్ని 2025 ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ దీని బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే ఈ వ్యాపారంపై దువ్వాడ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
కొత్త బ్రాంచీలు మొదలుపెడతాం
వకుళ సిల్క్స్ వ్యాపారం గ్రాండ్ సక్సెస్ అయిందని వ్యాపార రంగంలో టెక్స్‌టైల్ రంగంలో అడుగు పెట్టాక ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని అనుకోలేదని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. నిజానికి ఈ షాపు ప్రారంభించడానికి ముందు చాలా భయంగా, ఆందోళనతో మొదలుపెట్టామని కానీ సక్సెస్ చాలా తక్కువ సమయంలోనే వచ్చిందని చెప్పారు. మరిన్ని బ్రాంచీలు స్టార్ట్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. త్వరలో కూకట్ పల్లి, వైజాగ్‌లో కూడా రాబోతున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి బిల్డింగులు కోసం వెతుకుతున్నామని అవి సిద్ధమైతే వెంటనే బ్రాంచీలు ప్రారంభిస్తామని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. విద్యా సంస్థలు, గ్రానైట్లు, మైనింగ్‌లు వంటి వ్యాపారాలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే రాజకీయాల్లో దివ్వెల మాధురితో పరిచయం ఆయన జీవితాన్ని మార్చేసింది. తర్వాత పార్టీకి, కుటుంబానికి కూడా దూరం చేసింది. వీరిద్దరూ కలిసి ఇప్పుడు టెక్స్ టైల్ రంగంలో రాణిస్తున్నారు.
పన్నెండు కోట్లు సంపాదించా
తాజా ఇంటర్య్వూలో టెక్స్ టైల్ బిజినెస్ మీద తనకు కమాండ్ వచ్చిందని కేవలం 7 నెలల్లోనే 12 కోట్లు బిజినెస్ చేసామంటే మామూలు మాటలు కాదని దువ్వాడ అన్నారు. ఈ చీరల బిజినెస్ సక్సెస్ వెనుక 70 శాతం నుంచి 80 శాతం కష్టం మాధురిదేనని వివరించారు. మాధురికి చీరల గురించి బాగా తెలుసు,ఫాబ్రిక్ గురించి మంచి అవగాహన ఉందని... ఆమెను నమ్మే ఈ వ్యాపారంలోకి వచ్చానని చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. దీన్ని ప్రారంభించడానికి ముందు రెండు నెలల పాటు వీవర్స్‌తో, వెండర్స్‌తో కలిసి పని చేశానని చెప్పారు. బాగా స్టడీ చేశాకే చీరలు షాపును మొదలుపెట్టినట్టు చెప్పారు.
యాడ్స్ డిజైనింగ్ కూడా మేమే
వకుళ సిల్క్స్ కోసం సోషల్ మీడియాలో యాడ్స్ కూడా తామే సిద్ధం చేసుకుంటామని, ఎలాంటి థీమ్ తీసుకోవాలో ముందే చర్చించుకుంటామని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. దివ్వెల మాధురి కాఫీ పట్టుకొని వచ్చినప్పుడు ‘నీ చీర బావుంది’ అంటూ యాడ్ మొదలు పెట్టాలని ముందే చర్చించుకుని సిద్ధమవుతామని తెలిపారు. డైరెక్ట్‌గా ఒక ప్రజలతో మంచి కలెక్షన్ ఉండడం వల్లే వకుళ సిల్స్క్ ఇంతగా సక్సెస్ అయ్యిందని, తమకు సొంత స్టూడియో ఉండడం వల్ల ఇవన్నీ సక్సెస్ అయ్యాయని వివరించారు.

