క్లైమాక్స్ మార్చడంపై ధనుష్ ఆవేదన.. సినిమాకే ఇది ప్రమాదకరమంటూ నోట్.. పెద్ద రచ్చ
ధనుష్ హీరోగా నటించిన `రాంఝానా` మూవీ ఇటీవల రీ రిలీజ్ అయ్యింది. ఇందులో క్లైమాక్స్ ని మార్చడంపై ధనుష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది.

క్లైమాక్స్ మార్చడంపై ధనుష్ ఫైర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన తన సినిమా క్లైమాక్స్ ని మార్చడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను అభ్యంతరం తెలిపినా వినకుండా రీ రిలీజ్ సినిమాలో క్లైమాక్స్ మార్చారని, ఇది సినిమాకే ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. ఇది ఆర్ట్, ఆర్టిస్ట్ ని అవమానించడమే అవుతుందన్నారు. ఈ మేరకు ధనుష్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. మరి ఇంతకి ధనుష్ ఆవేదనకి కారణం ఏంటి? ఏ సినిమా విషయంలో ఇది జరిగిందనేది చూస్తే,
KNOW
`రాంఝానా`మూవీ రీ రిలీజ్
ధనుష్ హీరోగా, సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో 2013లో `రాంఝానా` మూవీ తెరకెక్కింది. అప్పట్లో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఇటీవల మళ్లీ రీ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 1న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా, మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ మూవీలో క్లైమాక్స్ ని మార్చారు. ఏఐని ఉపయోగించిన క్లైమాక్స్ ని మార్చి విడుదల చేశారు. ఈ విషయంలో తాను అభ్యంతరం తెలిపినా టీమ్ వినలేదని, ఇది అన్యాయమని, సినిమా ఆత్మనే లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ధనుష్.
ఏఐతో `రాంఝానా` క్లైమాక్స్ మార్పడంపై ధనుష్ ఆవేదన
ఏఐని ఉపయోగించి క్రియేట్ చేసిన క్లైమాక్స్ తో `రాంఝానా` మూవీని రీ రిలీజ్ చేయడం తనని కలతకు గురిచేసిందన్నారు. 12ఏళ్ల క్రితం తాను కమిట్ అయిన మూవీ ఇది కాదని, సినిమాల్లో కంటెంట్‌ని మార్చడానికి ఏఐని ఉపయోగించడం ఆర్ట్, ఆర్టిస్ట్ లను అవమానించడమే అని, ఇది ఇద్దరికీ ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇది కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ప్రమాదకరమన్నారు ధనుష్. భవిష్యత్‌లో ఇలాంటి పద్ధతులను నివారించేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు వెల్లడించారు ధనుష్.
సోషల్ మీడియా, ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న ధనుష్ పోస్ట్
ప్రస్తుతం ధనుష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద రచ్చ లేపుతుంది. ఫ్యాన్స్ ని సైతం ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి దీనిపై `రాంఝానా` మూవీ టీమ్ రియాక్షన్ ఏంటో చూడాలి. ధనుష్ ఇటీవల `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ వంద కోట్లకుపైగానే కలెక్షన్లని రాబట్టింది.
For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM
— Dhanush (@dhanushkraja) August 3, 2025
దర్శకుడిగా ధనుష్
ప్రస్తుతం ధనుష్ `ఇడ్లీ కాదై` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరోగా నటిస్తూ, నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `తెరే ఇష్క్ మెయిన్`తోపాటు మరో సినిమాలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు ధనుష్.