పరదాలు కట్టుకుని మీటింగ్‌లకు CM జగన్.. దానిపై సినిమా తీస్తారా?.. `యాత్ర2` డైరెక్టర్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ సీఎం యాత్రపై `యాత్ర2` సినిమా వస్తోంది. ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న `యాత్ర 2` దర్శకుడికి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన రియాక్షన్ మాత్రం టూ క్రేజీగా ఉండటం విశేషం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టి యాత్ర నేపథ్యంలో `యాత్ర` సినిమా చేశాడు దర్శకుడు మహి వీ రాఘవ్. అది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్‌గా `యాత్ర 2` మూవీ చేస్తున్నారు. ఇది వైఎస్‌ఆర్ సీఎం అయ్యాక చేపట్టిన కార్యక్రమాలు, ఆయన మరణం, ఆ తర్వాత వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర, ఆయన సీఎం అవ్వడం వరకు ఇందులో చూపిస్తున్నారు. అయితే ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్, తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు వైఎస్ జగన్ ఏం చేశాడనేది ఇందులో ప్రధానంగా ఉంటుందని దర్శకుడు మహి వీ రాఘవ్ తెలిపారు.

ఇందులో మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా, జీవా జగన్ పాత్రలో నటిస్తున్నారు. మరోరెండు రోజుల్లో గురువారం(ఫిబ్రవరి 8న) ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది టీమ్. దర్శకుడు మహి వీ రాఘవ్, జీవా, నటి కేతకి నారాయణ్ మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇందులో దర్శకుడు మహి వీ రాఘవ్‌కి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. వైఎస్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర చేశారు, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రతో `యాత్ర 2` చేస్తున్నారు. కానీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక ఆయన ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు, మీటింగ్‌లకు వెళ్లినా అదే పరిస్థితి, దీనిపై రకరకాల మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయని ప్రశ్నించారు.
దీనికి దర్శకుడు మహి వీ రాఘవ్ స్పందిస్తూ, సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేయోచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. ఫ్రీ నెట్ డాటా ఉంది, పనీపాట లేక ఖాళీగా ఉన్నవాళ్లు ఏమైనా పెడతారు. వాళ్లు అలా పెడుతూనే ఉన్నారు. అలా తొమ్మిదేళ్లు ఆయనపై(జగన్) దుమ్మెత్తిపోశారు. కానీ ఆయన 150కిపైగా సీట్లు సాధించి సీఎం అయ్యారు. అలాంటి కామెంట్లు పెట్టేవాళ్లు ఇంకా పెడుతూనే ఉన్నారు. వాళ్లు ఎప్పుడూ అక్కడే ఉంటారని తెలిపారు.
అంతేకాదు సోషల్ మీడియాలో వీరి(జగన్)పై బురద జల్లేవారు, వారిపై బురుద చల్లే వాళ్లు ఉంటారు. అది ఎవరు చల్లినా బురదే, అవన్నీ మనకెందుకు, వాళ్లకి అదే పనిగా చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోవల్సిన అవసరం లేదు అని తెలిపారు. మీడియాలో రెండు వర్గాలున్నాయి, వారికి సపోర్ట్ చేసేవాళ్లు, వీరికి సపోర్ట్ చేసేవాళ్లు ఉంటారు. రెండు రకాల వాదనలుంటాయి. అంతిమంగా మీడియా కూడా ఒక బిజినెస్సే అని వెల్లడించారు దర్శకుడు.
ఇంకా చెబుతూ, `యాత్ర2` కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదు. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి.
ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి, నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం. మమ్ముట్టి గారు చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను, కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్ మాత్రం నిజం` అని చెప్పారు మహి వీ రాఘవ్.