- Home
- Entertainment
- Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి చిరంజీవి ప్రత్యేక పాడ్‌కాస్ట్ షో చేయనున్నట్లు సమాచారం. కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలోకి మెగా ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన ఓ ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్ కార్యక్రమం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన చిరంజీవి.. ఈసారి తన వ్యక్తిగత, సినీ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను నేరుగా మాట్లాడే అవకాశం ఉంది.
డాక్యుమెంటరీకి బదులుగా కొత్త ఫార్మాట్
చిరంజీవి జీవితంపై డాక్యుమెంటరీ రూపొందించాలనే ఆలోచన మొదట ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన ప్రయాణాన్ని కేవలం దృశ్యాల రూపంలో చూపించడం కంటే, తానే స్వయంగా ప్రేక్షకులతో మాట్లాడితే మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావించినట్లు సమాచారం. దీంతో పాడ్‌కాస్ట్ రూపంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించే దిశగా అడుగులు పడినట్లు తెలుస్తోంది.
మెగా డాటర్ మాస్టర్ ప్లాన్
ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. తన తండ్రి డిజిటల్ అరంగేట్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కెరీర్‌లోని ఎన్నో విషయాలపై చర్చ
చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆయన 150 పైగా సినిమాల్లో నటించారు. చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదగడం, స్టార్‌గా మారడం, మెగాస్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం వరకు సాగిన ప్రయాణంలోని అనుభవాలను ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకునే అవకాశం ఉంది. సినీ పరిశ్రమలో ఎదురైన సవాళ్లు, విజయాలు, సహ నటులతో అనుబంధాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజకీయాల్లో వైఫల్యం గురించి కూడా ఈ పాడ్ కాస్ట్ లో చిరంజీవి నిర్మొహమాటంగా మాట్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వ్యక్తిగత విషయాలపైనా ఆసక్తి
సినిమాలు, రాజకీయాల్లో ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని వ్యక్తిగత అనుభవాలను కూడా చిరంజీవి పంచుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ఈ పాడ్ కాస్ట్ సంచలనం కావడం ఖాయం. చిరంజీవి, నెట్‌ఫ్లిక్స్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాడ్‌కాస్ట్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అయితే కార్యక్రమం ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుంది, ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి, ఇందులో ఎవరెవరు పాల్గొంటారు అనే వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, కాకా సినిమాల్లో నటిస్తున్నారు. కాకా చిత్రం సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది.

