టాలీవుడ్‌లో మళ్లీ తెరపైకి విభేదాలు?.. చిరు వన్ మ్యాన్ షో.. జీర్ణించుకోలేకపోతున్న మోహన్‌బాబు వర్గం ?
టాలీవుడ్‌లో పెద్దల మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నేడు(మంగళవారం) జరగాల్సిన ఇండస్ట్రీ పెద్ద మీటింగ్ వాయిదా పడటంతోనే ఆ విషయం స్పష్టమవుతుంది. ఒకరి పెద్దరికాన్ని మరొకరు జీర్ణించుకోలేకపోతున్నారనేది స్పష్టమవుతుంది.
గత నెలలో ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. సీఎం అపాయింట్‌మెంట్ మేరకు చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఏపీలో టికెట్ల రేట్లు, ఇండస్ట్రీ సమస్యలపై గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కి మధ్య గ్యాప్ వచ్చింది. సినిమా విడుదల విషయంలో, టికెట్ల రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ గా లేదని టాలీవుడ్ ప్రముఖులు వాపోతున్నారు. ఇది పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు జగన్, చిరంజీవి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ నెల(ఫిబ్రవరి) 10న ఏపీ సీఎంతో చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈ సారి చిరంజీవితోపాటు ఇండస్ట్రీ పెద్దలను కలుపుకుని రావాలని సీఎం జగన్ తెలిపినట్టు సమాచారం. అందులో భాగంగానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో గత రెండు మూడు రోజులుగా సినీ పెద్దలు సమావేశమై సమస్యలను చర్చించాలని, ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లపై కులంకషంగా చర్చించాలని భావించారు. కానీ అది వాయిదా పడటం పట్ల సరికొత్త చర్చ తెరపైకి వస్తుంది.
ఇండస్ట్రీ పెద్దలు అందరు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ మీటింగ్ వాయిదా పడిందని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు చెబుతున్నారు. కానీ కొంత మంది ఈ మీటింగ్‌పై సానుకూలంగా లేకపోవడం కారణంగానే వాయిదా పడిందని తెలుస్తుంది. ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదని, చిరంజీవి పెద్దరికాన్ని వాళ్లు జీర్ణించుకోలేక ఈ మీటింగ్‌కి హాజరు కావడం లేదని ఫిల్మ్ నగర్లో చర్చ నడుస్తుంది. అందులో ప్రధానంగా మోహన్‌బాబు వర్గం ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మంచు విష్ణు నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని టాక్. ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఛాంబర్ అని, పెద్దలు బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, కృష్ణంరాజు వంటి వారు కలిసి కూర్చొని చర్చించాలని, ఒకరిద్దరు కలిసి మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదని ఆయన పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారని అంటున్నారు.
నిన్న(సోమవారం) తిరుపతి `మా` అధ్యక్షుడు మంచు విష్ణు వ్యాఖ్యలుండటం గమనార్హం. సీఎం జగన్‌ని చిరంజీవి కలవడం అది ఆయన వ్యక్తిగతమని తెలిపారు. టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని, ఈ వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళతామని మంచు విష్ణు చెప్పిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి పెద్దరికాన్ని మంచు ఫ్యామిలీ జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే `మా` ఎన్నికల నుంచి చిరుకి, మోహన్‌బాబుకి పడటం లేదు.
`మా` ఎన్నికల విషయంలో చిరంజీవిని బ్లేమ్ చేస్తూ `మా` అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు, మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చిరంజీవి.. ఇండస్ట్రీ పెద్దగా ఉండబోనని, ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని తెలిపారు. ఇద్దరు గొడవ పడితే తాను పెద్దరికం చేయబోనని, అలాంటి పెద్దరికం తనకొద్దని స్పష్టం చేశారు చిరంజీవి. అయితే ఆ టైమ్‌లో చిరుకి, మోహన్‌బాబుకి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అంతకుముందు `లెజెండరీ` విషయంలోనూ చిరుకి, మోహన్‌బాబుకి మధ్య స్టేజ్‌పైనే వాగ్వాదం చోటు చేసుకుంది.
కానీ మధ్యలో వీరిద్దరు తాము మంచి స్నేహితులమే అనే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. ఆ మధ్య జరిగిన `మా` డైరీ ఆవిష్కరణ సమయంలోనూ వీరిద్దరి మధ్య స్నేహాన్ని చాటుకున్నారు. మోహన్‌బాబుకి చిరంజీవి ఏకంగా హగ్ చేసుకుని కిస్ కూడా పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి మధ్య ఏం లేదనే విషయాన్ని పాస్ ఆన్ చేశారు. కానీ ఇప్పుడు మరోసారి వారి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విషయంలో వ్యవహరించాల్సిన విషయంపై చిరంజీవి పలు వేదికలపై రిక్వెస్ట్ లు చేస్తుండగా, మోహన్‌బాబు మాత్రం జస్ట్ ఓ మీడియా ప్రకటన విడుదల చేసి సినీ పెద్దలపై విమర్శలు చేశారు.
ఆ తర్వాత మళ్లీ స్పందించలేదు మోహన్‌బాబు. అయితే ఇటీవల చిరంజీవి.. ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. కేవలం చిరంజీవి మాత్రమే హాజరయ్యారు. దీంతో ఇది ఇండస్ట్రీ పెద్దలకు మింగుడు పడటం లేదనే టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా మోహన్‌బాబు వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోతుందట. ఇండస్ట్రీ పెద్దలను అందరిని కలుపుకుని పోవాల్సి ఉందని, కానీ చిరు ఒక్కరే సీఎంని కలవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో మరోసారి ఇండస్ట్రీ పెద్దల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డట్టయ్యింది. చిరు వన్‌మ్యాన్ షోని తట్టుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఇండస్ట్రీలో యూనిటీ లేకపోవడం, పెద్దరికంగా వ్యవహరించే వ్యక్తి లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సమస్యకి ఎక్కడ పుల్‌స్టాప్ పడుతుంది. ఈ నెల 10న ఏపీ సీఎంతో భేటీ ఉంటుందా? లేదా అనేది సస్పెన్స్ గా మారింది.