- Home
- Entertainment
- Pawan Kalyan తో సినిమా, అసలు జరిగింది ఇదే.. వెంకీతో మూవీపై అనిల్ రావిపూడి క్లారిటీ
Pawan Kalyan తో సినిమా, అసలు జరిగింది ఇదే.. వెంకీతో మూవీపై అనిల్ రావిపూడి క్లారిటీ
ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాలపై స్పందించారు. పవన్‌తో, వెంకటేష్‌తో సినిమాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

ఇండస్ట్రీ హిట్‌గా `మన శంకర వర ప్రసాద్ గారు`
దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు తిరుగులేని స్టార్ డైరెక్టర్ అయిపోయారు. పరాజయం లేని దర్శకుడిగా రాణిస్తున్నారు. రాజమౌళి తర్వాత అత్యంత సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలవడం విశేషం. ఆయన రూపొందించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. నాన్ పాన్ ఇండియా చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
పవన్, వెంకీ, నాగ్ చిత్రాలపై అనిల్ రావిపూడి రియాక్షన్
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి.. వెంకీతో కలిసి మల్టీస్టారర్ చేయమని ఏకంగా సినిమా ఈవెంట్‌లోనే ప్రకటించారు. మరోవైపు వెంకటేష్ తోనే `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అలాగే నాగార్జునతో చర్చలు నడుస్తున్నాయని అన్నారు. ఇవన్నీ రూమర్స్ గా ఉన్న నేపథ్యంలో వీటిపై అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఏసియానెట్ రిపోర్టర్ ప్రశ్నించిన నేపథ్యంలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ని ఇంకా కలవలేదు
పవన్ కళ్యాణ్‌తో మూవీపై రియాక్ట్ అవుతూ, తాను ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌ని కలవలేదని చెప్పారు. పవన్‌తో సినిమా చేయాలని ఉందని, కానీ ఇంకా కథ చెప్పలేదన్నారు. పవన్ గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రెగ్యూలర్ సినిమాలు చేసే స్టార్ కాదని, ఆయనకు రాజకీయంగా ప్రజాసేవలో బాధ్యతలు ఉన్నాయి. ఆయనతో సినిమా సెట్ అయితే సంతోషమే, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆయనకు ఇంకా కథ చెప్పలేదని తెలిపారు.
సీక్వెల్ చేయను.. చిరు, వెంకీతో ఇప్పుడు లేదు
అదే సమయంలో చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌కి సంబంధించి ఆయన రియాక్ట్ అవుతూ, చిరంజీవితో, వెంకటేష్ తో సినిమా చేయాలని ఉందని, భవిష్యత్‌లో చేస్తానని, ఇప్పటికైతే ఇంకా ఏం అనుకోలేదని తెలిపారు. అదే సమయంలో `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్ కూడా ఉండబోదని చెప్పారు. తాను సీక్వెల్ చేయదలుచుకోలేదని వెల్లడించారు. దీనికితోడు రీమేక్‌లపై స్పందిస్తూ, తనకు రీమేక్‌లు చేయడం ఇష్టం లేదన్నారు. ఒకే ఇంట్లో రెండు సార్లు భోజనం చేయడం ఇష్టం ఉండదని, మరో ఇంట్లో కొత్తగా తినాలని ఉంటుందని, అలానే సీక్వెల్ చేసి అదే కథని కొనసాగించలేనని, కొత్త కథలతో కొత్తగా సినిమాలు చేయాలనేది తన ప్లాన్ అని వెల్లడించారు అనిల్ రావిపూడి.
క్రేజీ పాయింట్‌తో కొత్త సినిమా
నెక్ట్స్ మూవీపై స్పందిస్తూ, ఓ క్రేజీ పాయింట్‌తో రాబోతున్నట్టు తెలిపారు. అందరు షాక్ అవుతారని, వామ్మో ఇలాంటి కథేంటని ఆశ్చర్యపోతారని తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లోనే ఉన్నానని, ఇంకా ఎవరితో చేయాలనేది ఫైనల్ కాలేదని తెలిపారు. అన్ని కుదిరాక కొత్త సినిమాని ప్రకటిస్తానని తెలిపారు అనిల్. దీంతో నెక్ట్స్ `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్ లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక సంక్రాంతికి పండగ సందర్భంగా విడుదలైన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. ఇది మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు.

