అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా, ఆయన చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ సీరియస్ అవ్వగా, మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు.

Actor Sivaji
నటుడు శివాజీ వివాదంలో చిక్కుకున్నారు. తన సినిమా దండోరా ప్రీ రీలీజ్ ఈ వెంట్ లో భాగంగా తన మూవీ గురించి చాలా గొప్పగా మాట్లాడిన ఆయన చివర్లో... అమ్మాయిలు, హీరోయిన్ల దుస్తుల గురించి చాలా దారుణంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సామాన్లు కనిపించేలా దుస్తులు వేసుకోకండి.. అలా వేసుకుంటే...దరిద్రపు ముండ ఇలాంటి బట్టలు వేసుకుందేంటి అని అందరూ అనుకుంటారు అని ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఆయన చేసిన కామెంట్స్ ని కొందరు మెచ్చుకుంటున్నారు. మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హీరోయిన్లపై ఉపయోగించిన పదజాలం, ఇచ్చిన సలహాలు మహిళల పట్ల ఉన్న దృక్పథాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని చాలా మంది విమర్శిస్తున్నారు. ప్రొఫెషనల్ ఈవెంట్స్ లో గౌరవం, సంయమనం లేకుండా మాట్లాడటం ఎంత వరకు సరైనది అనే చర్చ మొదలైంది. సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ, హీరో మంచు మనోజ్ ఈ విషయంపై చాలా సీరియస్ గా స్పందించారు.
చిన్మయి సీరియస్...
‘ తెలుగు నటుడు శివాజీ, హీరోయిన్లకు అనవసరమైన సలహాలు ఇస్తూ.. ‘దరిద్రపు ముండ’ వంటి దూషణ పదాలు ఉపయోగించారు. సామాన్లు కప్పుకోవడానికి చీరలు ధరించాలని ఆయన అన్నారు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ పాత్ర పోషించి, చివరకు చాలా మంది అబ్బాయిలకు హీరోగా మారిపోయాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... ఇవన్నీ ప్రొఫెషనల్ ఈవెంట్స్. అలాంటి చోట్ల శివాజీ ‘దరిద్రపు ముండ’ వంటి పదాలు ఉపయోగిస్తున్నారు. ఆయన మాత్రం జీన్స్, హుడీలు ధరిస్తాడు. అతను కూడా భారతీయ సంస్కృతి ప్రకారం ధోతీ ధరించాలి కదా. అతనికి పెళ్లి అయ్యి ఉంటే.. బొట్టు, కాళ్లకు మెట్టెలు కూడా ధరించాలి కదా, ఇక్కడ అమ్మాయిలను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో’ అంటూ చిన్మయి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
అనసూయ ఏమన్నారంటే.....
ఇదే విషయంపై తెలుగు యాంకర్ అనసూయ కూడా స్పందించారు. ‘ ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేది ఎవరి ఇష్టం. ఎవరికి ఏది నప్పితే అది వేసుకుంటారు. ఆయనకు ఇన్ సెక్యూర్ ఫీలింగ్ చాలా ఎక్కువ అనుకుంట. నా దృష్టిలో డ్రెస్సింగ్ అనేది ఒక వ్యక్తి వ్యక్తగతం. తిండి, బట్ట అనేది ఎవరికి నచ్చింది వాళ్లు ఎంచుకుంటారు. ఆయనకు అలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు ఆయన్ని చూసి నేను జాలి పడుతున్నాను’ అని అనసూయ పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పిన మనోజ్
ఇదే విషయంపై మంచు మనోజ్ కూడా స్పందించడం గమనార్హం. ‘ ఈ రకమైన మాటలు తీవ్ర నిరాశ కలిగించాయి. మహిళల దుస్తులను అదుపు చేయడం లేదా వారిపై నైతిక బాధ్యతను మోపడం ఆమోదయోగ్యం కాదు. గౌరవడం, జవాబుదారీతనం అనేది వ్యక్తిగత ప్రవర్తనతో ప్రారంభం కావాలి. మహిళలు ఎలాంటి దుస్తులు ధరిస్తారనే దాని గురించి వారిని అవమానించకూడదు. ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ముఖ్యంగా వారి మాటలు సమాజాన్ని ప్రభావితం చేసినప్పుడు. ఇలాంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21ల స్ఫూర్తిని ఉల్లంఘిస్తాయి. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చలకు వీలుకానివి. మహిళల దుస్తులు ప్రజా తీర్పుకు అర్హమైనవి కావు. మహిళలను అవమానించి, వారిని వస్తువులుగా తగ్గించిన సీనియర్ నటుల తరుపున నేను నిస్సందేహంగా క్షమాపణలు కోరుతున్నాను. అలాంటి మాటలు అందరు పురుషులను సూచించవు. మహిళలు అన్ని సమయాల్లో గౌరవం, సమానత్వం కలిగి ఉండాలి. నిశ్శబ్దం ఒక ఎంపిక కాదు, జవాబుదారీతనం అవసరం.’ అని మంచు మోనోజ్ పేర్కొన్నారు.

