అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, జేఏసీ ఎంట్రీతో ముదిరిన వివాదం.. అసలు తప్పు ఎవరిది?
అల్లు అర్జున్ వివాదం చిలికి చిలికి గాలి వాన అయ్యింది. ఉస్మానియా జేఏసీ ఎంట్రీతో దాడుల పర్వం మొదలైంది. వివాదం రాజకీయ రంగు పులుముకున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ ఇంటి పై దాడి ఘటన సంచలనం రేపింది. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సభ్యులు ఈ దాడికి తెగబడ్డారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన సభ్యులు విధ్వసం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్ ఈ దాడిపై స్పందించారు. మేము సంయమనం పాటిస్తున్నాము. చట్టం ప్రకారం ముందుకు వెళతామని మీడియాకు స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్న సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షోకి హాజరైన రేవతి మృతికి అల్లు అర్జునే బాధ్యడని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పించారు. అరెస్ట్ అనంతరం విడుదలైన అల్లు అర్జున్ ని పరామర్శించిన టాలీవుడ్ ప్రముఖులను సైతం ఆయన దుయ్యబట్టారు. అల్లు అర్జున్ కి కన్ను పోయిందా? కాలు పోయిందా?.. ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ని కలవని మీరు, అల్లు అర్జున్ కి సంఘీభావం తెలపడం ఏంటంటూ.. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్స్ ధరల పెంపుకు అనుమతి లేదని ప్రకటించడం ద్వారా... టాలీవుడ్ తో అమీతుమీకి సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి సందేశం పంపారు. రేవంత్ రెడ్డి విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ మీడియా ముందుకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే, కౌంటర్లు ఇచ్చారు. కావాలని చేసింది కాదు. ఇది అనుకోని ప్రమాదం. తప్పుడు ప్రచారం ద్వారా నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల నాకు పూర్తి బాధ్యత ఉందని అన్నారు.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అనంతరం పరిణామాలు మరింత హీటెక్కాయి. ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు(OU - JAC) రేవతి మృతికి నిరసనగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేవతి కుటుంబానికి రూ. 25 కోట్ల పరిహారం చెల్లించాలని హెచ్చరికలు జారీ చేశారు. దాడికి పాల్పడిన ఆరుగురు జేఏసీ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.
అయితే జేఏసీ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడిలో పాల్పడ్డారనే వాదన ఉంది. ఈ దాడికి నేతృత్వం వహించిన ప్రధాన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు అని సమాచారం. రేవంత్ రెడ్డితో దాడి చేసిన వ్యక్తులు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ ని సీఎం రేవంత్ కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారనే కోణం కూడా తెరపైకి వస్తుంది.
కాగా రేవతి మరణించి ఇన్ని రోజుల తర్వాత జేఏసీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలన్న ఇప్పటి వరకు ఎందుకు రాలేదనే సందేహాలు మొదలయ్యాయి. అయితే సాధారణ జనాల్లో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లి తప్పు చేశాడని ఓ వర్గం భావిస్తున్నారు. అదే సమయంలో మరొక వర్గం... తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.