- Home
- Entertainment
- Chiranjeevi: జగన్ తో చిరు భేటీపై ఉత్కంఠ.. నాగార్జున, రాజమౌళి ఇంకా ఎవరెవరు.. మంచు విష్ణు దూరమేనా ?
Chiranjeevi: జగన్ తో చిరు భేటీపై ఉత్కంఠ.. నాగార్జున, రాజమౌళి ఇంకా ఎవరెవరు.. మంచు విష్ణు దూరమేనా ?
సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానుండడం ఉత్కంఠగా మారింది. ఏపీలో కొనసాగుతున్న టికెట్ ధరల సమస్యపై వీరి మధ్య చర్చ జరగనుంది.

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి గురువారం భేటీ కానున్నారు. ఈ మధ్యనే చిరంజీవి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. మరోసారి జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం రావడంతో ఉత్కంఠగా మారింది. ఈ భేటీకి సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నాని సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, జగన్ మధ్య తగ్గించిన సినిమా టికెట్ ధరలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
టికెట్ ధరల విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ ధరల పెంపుకే కమిటీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరు, జగన్ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే చిరంజీవితో పాటు ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా జగన్ తో భేటీ కానున్నట్లు సమాచారం.
గతంలో చిరంజీవి మాత్రమే జగన్ తో భేటీ అయ్యారు. ఈసారి చిరుతో పాటు కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా వెళ్లనున్నారు. వారిలో నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ వీరి పేర్లని అధికారికంగా ప్రకటించలేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. తారక్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని టాక్.
దర్శక నిర్మాత తమ్మారెడ్డి అయితే చిరంజీవి ఒక్కరే జగన్ కి సమస్యలు వివరించగలరా? తమని కూడా ఆహ్వానించాలని కోరారు. పైన పేర్కొన్న పేర్లన్నీ చిరంజీవితో సన్నిహితంగా ఉండేవారే. చిరంజీవి, మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలు మళ్ళీ రాజుకున్నాయి. ఇటీవల మా అధ్యక్షుడి హోదాలో ఉన్న మంచు విష్ణు.. చిరంజీవి, జగన్ భేటీ వ్యక్తిగతం అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
సో రేపటి భేటీకి మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ ఉండబోవడం లేదనేది అర్థం చేసుకోవచ్చు. 'మా' తరుపున ఎవరో ఒకరు ప్రతినిధిగా వెళ్ళాలి కదా అనే వాదన కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు కూడా టికెట్ ధరలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఏది ఏమైనా ఏపీ సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల రేపటి భేటీ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ నెల నుంచే వరుసగా ఖిలాడీ, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య లాంటి భారీ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి చిరంజీవి జగన్ ని ఒప్పించి టాలీవుడ్ సమస్యలు తీరుస్తారా అనేది తేలాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.