రాజమౌళినే కరెక్ట్... ఆదిపురుష్ చూసిన ఆడియన్స్ ఫీలింగ్
ఆదిపురుష్ మూవీ పూర్తి స్థాయిలో మెప్పించలేదని పలువురు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి పేరు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.

Adipurush-Rajamouli
రామాయణ మహాభారతాలకు న్యాయం చేసే సత్తా టాలీవుడ్ దర్శకులకు మాత్రమే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ మూవీ చూశాక ఈ వాదన మరింత బలపడింది. తెలుగులో లవకుశ ఆల్ టైం ఎపిక్ గా నిలిచిపోయింది. రామాయణ గాథను ఎందరు తెరకెక్కించిన లవకుశ చిత్ర ప్రత్యేకత వేరు. తెలుగులో పలువురు మేకర్స్ రామాయణాన్ని వెండితెరపై గొప్పగా ఆవిష్కరించారు. ఇక మహాభారతం గురించి చెప్పాలంటే దాన వీర శూరకర్ణ తిరుగులేని చిత్రం. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లవకుశ, దాన వీర శూర కర్ణ పలువురు ఫిల్మ్ మేకర్స్ కి స్ఫూర్తిగా నిలిచాయి. వీటన్నింటినీ మించిన చిత్ర రాజంగా మాయాబజార్ ఉంది.
పౌరాణిక చిత్రాలు తెరకెక్కించడంలో తెలుగు దర్శకులు దిట్టనే వాదన ఉంది. అది మరోసారి రుజువైంది. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే వాదన వినిపిస్తోంది. రామాయణ పాత్రల నుండి ఆయన ఎమోషన్ రాబట్టలేకపోయారు, ఆకట్టుకోని స్క్రీన్ ప్లే, నాసిరకం విజువల్స్ ఇబ్బంది పెట్టాయని పలువురి భావన.
ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రాజమౌళి పేరు ప్రస్తావిస్తున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కి నచ్చేలా గ్రాండ్ గా మహాభారతం, రామాయణం తెరకెక్కించాలంటే రాజమౌళి రావాల్సిందే అంటున్నారు. ఓం రౌత్ విఫలం చెందాడు, రామాయణ, మహాభారతాలను గొప్ప విజువల్ వండర్స్ గా మార్చే సత్తా ఒక్క రాజమౌళికే ఉందంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది.
రాజమౌళి చాలా కాలంగా తన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం అని చెబుతున్నారు. అయితే నా ఊహలకు తగ్గట్లు మహాభారతం తెరకెక్కించే అనుభవం ఇంకా రాలేదు. అందుకు మరింత సమయం కావాలి, నేర్చుకోవాలి అప్పుడే మహాభారతం చేస్తాను అన్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి హీరో మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. మహేష్ మూవీ అనంతరం రాజమౌళి మహాభారతం తెరకెక్కించే అవకాశాలు కొట్టిపారేయలేం.
ఇక రాజమౌళి మహాభారతం రెండు మూడు భాగాలుగా తెరకెక్కే అవకాశం కలదు. ఇంకా డిటైల్డ్ గా చెప్పాలనుకుంటే ఆయన భారీ వెబ్ సిరీస్ గా తెరకెక్కించే సూచనలు కలవు. రామాయణమైనా, మహాభారతమైనా రాజమౌళి తెరకెక్కిస్తే అది అద్భుతం అవుతుందని సినిమా ప్రేమికుల విశ్వాసం...