Sunil: నడ్డివిరిగితే గానీ తత్త్వం బోధపడలేదు అయ్యగారికి!
జీవితంలో దెబ్బలు తగిలితే గాని ఎవరికైనా తత్త్వం బోధపడదు. షాకులు ఎదురైతే కానీ, అసలు విషయం తెలిసి రాదు. అప్పటి వరకు నా కంటే, తోపు ఎవ్వడూ లేదనిపిస్తుంది. అలా అనుకునే నటుడు సునీల్ బొక్కబోర్లా పడ్డాడు. దెబ్బలు తగిలాక నిజాలు తెలుసుకొని, కెరీర్ ని నిర్మించుకుంటున్నాడు.

స్టార్ కమెడియన్ గా సునీల్ (Sunil) ఏడాదికి ఇరవై నుండి ముప్పై సినిమాలు చేసేవారు. రోజుకు లక్షల్లో రెమ్యూనరేషన్. తీరిక లేని షెడ్యూల్స్. కమెడియన్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న తరుణంలో సునీల్ కి అందాల రాముడు సినిమాలో హీరోగా చేసే అవకాశం దక్కింది. అది కూడా ఆర్తి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ కి జంటగా. అప్ కోర్స్ అప్పటికే ఆర్తి అగర్వాల్ ఫార్మ్ కోల్పోయింది అనుకోండి..
అందాల రాముడు సినిమాతో హీరోగా మారినా... సునీల్ క్యారెక్టర్ మాత్రం ఫుల్ కామెడీగానే ఉంటుంది. ఎక్కడా హీరోయిజం ఛాయలు కనిపించవు. కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత కూడా సునీల్ కమెడియన్ గా కొనసాగారు. 2010లో రాజమౌళి (Rajamouli) ఓ ప్రయోగాత్మక చిత్రం చేయాలనుకున్నారు. దానికి సునీల్ ని ఎంచుకున్నాడు. మర్యాద రామన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంతో హీరోగా మరో సూపర్ హిట్ కొట్టాడు సునీల్. ఈ మూవీ కోసం బరువు తగ్గి, ఓ స్థాయి హీరో లుక్ లో దర్శనం ఇచ్చాడు.
తర్వాత వర్మతో చేసిన కథ స్క్రీన్ ప్లే అప్పల్రాజు అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక పూల రంగడు మూవీతో సునీల్ పూర్తి స్థాయి మాస్ హీరో అవతారం ఎత్తాడు. సిక్స్ ప్యాక్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. ఈ సినిమా కూడా హిట్ కావడంతో సునీల్ స్టార్ హీరో రేంజ్ కి వెళ్లడం ఖాయం అని అందరూ భావించారు. సునీల్ కూడా ఇక హీరోగా సెటిల్ అయినట్లే ఫిక్స్ అయ్యాడు. అయితే పూల రంగడు మూవీ తరువాత సునీల్ కి వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. నాగ చైతన్య (Naga chaitanya) తో చేసిన మల్టీస్టారర్ తడాఖా మినహాయిస్తే, అన్నీ ప్లాప్స్ ఖాతాలోకి చేరాయి.
సునీల్ కెరీర్ అయోమయంలో పడింది. హీరోగా అవకాశాలు ఆగిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఏమిటో అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ కమెడియన్ గా మారాడు. తన ఫ్రెండ్ త్రివిక్రమ్ అరవింద సమేత లో ఓ పాత్ర ఇచ్చారు. నిజానికి ఆ పాత్రకు ఏమంత ప్రాధాన్యత ఉండదు. కామెడీ పంచే స్కోప్ కూడా లేదు. ఆ తర్వాత వరుసగా కామెడీ రోల్స్ చేశారు. మాస్ హీరోగా సిక్స్ ప్యాక్ లో చూసిన తర్వాత, సునీల్ లో ఒకప్పటి కమెడియన్ ప్రేక్షకులకు కనిపించలేదు. ఆయన కామెడీ ఆడియన్స్ కి నవ్వు తెప్పించడం లేదు.
ఓ కమెడియన్ హీరో కావాలనుకోవడం తప్పులేదు. సీనియర్ నటుడు ఆలీ మాదిరి... కామెడీ చిత్రాల హీరోగా చేస్తూ, ఇతర హీరోల చిత్రాలలో కమెడియన్ గా చేస్తే కెరీర్ కి ఎటువంటి డోకా ఉండదు.అలా కాకుండా, యాక్షన్ హీరోగా ట్రై చేసి ఫెయిల్ అయితే పర్యవసానం ఇలాగే దారుణంగా ఉంటుంది. సునీల్ కొన్నాళ్ళు అదే పరిస్థితి ఫేస్ చేశాడు. అయితే ప్రస్తుతం తెలివిగా విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ లాంగ్ టర్మ్ కెరీర్ ని నిర్మించుకునే పనిలో ఉన్నాడు.
Sunil
డిస్కో రాజా చిత్రంతో విలన్ అవతారం ఎత్తిన సునీల్ వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలు చేస్తున్నాడు. కలర్ ఫోటో మూవీలో సునీల్ నెగిటివ్ రోల్ చేశాడు. అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా మూవీ పుష్ప (Pushpa) లో సునీల్ మరోమారు విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఎదురుదెబ్బల నుండి గుణపాఠం నేర్చుకున్న సునీల్, విలక్షణ పాత్రల ద్వారా లాంగ్ టర్మ్ కెరీర్ ఉంటుందని అర్థం చేసుకున్నాడు. మరలా హీరో కాకరకాయ్... అనకుండా కామెడీ నుండి విలనీ వరకు అన్ని రకాల పాత్రలు చేస్తూ... తెలివైన ప్రణాళికలు వేస్తున్నాడు.
Also read ”మంగళం శ్రీను” మడతెట్టేస్తాడు
Also read అల్లు అర్జున్ తో మహానటి...భారీ ప్లాష్ బ్యాక్