- Home
- Entertainment
- నాజర్, చిరంజీవి మధ్య ఇంత జరిగిందా.. అన్నం పెట్టిన మిత్రుడు అంటూ ఎమోషనల్, కలసి నటించకపోవడానికి కారణం
నాజర్, చిరంజీవి మధ్య ఇంత జరిగిందా.. అన్నం పెట్టిన మిత్రుడు అంటూ ఎమోషనల్, కలసి నటించకపోవడానికి కారణం
లెజెండ్రీ నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్రుడే. వీళ్ళిద్దరూ చెన్నైలో క్లాస్ మేట్స్ అట. ఇటీవల ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఆయనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. కమెడియన్ సుధాకర్ అయితే చిరంజీవికి రూమ్ మేట్. చిరంజీవి హీరో అయ్యాక.. ఆయన చిత్రాల్లో సుధాకర్ నటించారు. అదే విధంగా లెజెండ్రీ నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్రుడే. వీళ్ళిద్దరూ చెన్నైలో క్లాస్ మేట్స్ అట.
ఇటీవల ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి రోజులని గుర్తు చేసుకున్నారు. నేను అప్పుడు సైకిల్ లో వెళ్లే వాడిని. ఒక చోట సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో నేను హోటల్ లో పని చేస్తున్నాను. నెల నెల జీతం వచ్చేది. షూటింగ్ చూద్దామని అక్కడ ఆగాను. అప్పుడే చిరంజీవి ఎదుగుతున్నారు. అది చిరంజీవి సినిమా షూటింగ్.
చిరంజీవి నన్ను గమనించి పిలిచారు. నాజర్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. నేను హోటల్ లో పనిచేస్తున్నాను అని చెప్పను. అదేంట్రా నువ్వు హోటల్ లో పనిచేయడం ఏంటి.. నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. రేపు నువ్వు రా.. నేను వేరే వాళ్ళకి చెబుతాను అని అన్నారు. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు. మీరు తప్పకుండా రావాలి అని చిరంజీవి అన్నారు. మొహమాటంతో సరే అని చెప్పి వెళ్ళిపోయాను.
కానీ మరుసటిరోజు నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆ సమయంలో నాకు సినిమా పై నమ్మకం లేదు. ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలియదు. వచ్చిన సక్సెస్ అవుతామో లేదో తెలియదు. నెల నెల జీతం వచ్చే ఉద్యోగం చేయడమే మంచిది అనిపించింది. అందుకే వెళ్ళలేదు.
ఆ తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు. నాకు కూడా కొన్ని అవకాశాలు రావడం బాలచందర్ గారి చిత్రాలతో నేను ఫేమస్ అవ్వడం జరిగింది. కానీ నేను చిరంజీవి కలసి నటించడం ఎప్పుడూ జరగలేదు. చిరంజీవి నా ఫ్రెండ్ కదా.. ఛాన్స్ అడుగుదాం అని నేను ఎప్పుడూ అనుకోలేదు.. చిరంజీవి కూడా నన్ను పిలిచి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది.
కానీ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 నేను నటించడం జరిగింది. అందులో నాది పెద్ద పాత్ర కూడా కాదు. నేను 150 సినిమాల వరకు చిరంజీవితో ఎందుకు నటించలేదు.. ఆ చిత్రంలోనే ఎందుకు నటించాను అనే దానికి ఆన్సర్ లేదు. మేమిద్దరం దీని గురించి చర్చించుకుని ఎమోషనల్ అయ్యాం కూడా అని నాజర్ అన్నారు.
చెన్నైలో నేను చిరంజీవి కాలేజీలో ఉన్నప్పుడు చిరంజీవి నాకు అన్నం పెట్టారు. నేను చెన్నైకి దూరంగా ఉండేవాడిని ఉదయం 6 గంటలకే ట్రైన్ లో బయలుదేరాల్సి వచ్చేది. దీనితో అమ్మ బాక్స్ లో అన్నం మాత్రమే పెట్టేది. ఫ్రెండ్స్ ఎవరైనా సాంబార్ పెడితే తినేసేవాడిని. ఒక రోజు చిరంజీవి అది చూశారు. చిరంజీవి ఇతర ఫ్రెండ్స్ ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకునేవారు. నువ్వు రేపటి నుంచి అన్నం కోసం మీ అమ్మని ఇబ్బంది పెడితే నేను నిన్ను చంపేస్తా.
మేము ఇక్కడ 7 మంది తింటున్నాం. నీ ఒక్కడికి తక్కువ అయిపోతుందా. రేపటి నుంచి నువ్వు కూడా మాతోనే భోజనం చేయాలి అని చెప్పారు. ఆ విధంగా చిరంజీవి నాకు భోజనం పెట్టారు అని నాజర్ గుర్తు చేసుకున్నారు.