మురళీమోహన్ భార్య కావాల్సిన శ్రీదేవి... మరి ఏం జరిగింది?
అతిలోక సుందరి శ్రీదేవి నటుడు మురళీమోహన్ భార్య కావాల్సిందట. శ్రీదేవి తల్లిగారు మురళీమోహన్ ని అల్లుడు చేసుకోవాలని గట్టిగా అనుకున్నారట. మరి ఎందుకు ఈ సంబంధం కుదర్లేదో ఆయన ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు.

శ్రీదేవి అంటే తెలియని సినిమా ప్రేమికుడు ఉండదు. దశాబ్దాల పాటు ఆమె ఆరాధించబడ్డారు. మరణించే వరకూ శ్రీదేవి నటిస్తూనే ఉన్నారు. కాగా శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు, వివాదాలు ఉన్నాయి. కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. హీరో మిథున్ చక్రవర్తిని శ్రీదేవి రహస్య వివాహం చేసుకుందని అంటారు. ఏది ఏమైనా శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్నారు. ఆయనకు శ్రీదేవితో రెండో వివాహం. అయితే కెరీర్ బిగింగ్ లోనే శ్రీదేవి తల్లి ఆమె ఒక సంబంధం చూశారట. నటుడు మురళీమోహన్ కి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట.
పరిశ్రమలో మురళీ మోహన్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరుంది. ఆయన పరిశ్రమకు వచ్చే ముందు జూదం, మందు, అమ్మాయిలు... ఈ మూడింటి జోలికి పోకూడదని నిర్ణయించుకున్నాడట. తన నిర్ణయానికి కట్టుబడి చాలా పద్దతిగా ఉండేవాడట. దీంతో శ్రీదేవి తల్లి మురళీమోహన్ ని అల్లుడు చేసుకోవాలనుకున్నారట. మురళీమోహన్ సన్నిహితులతో ఈ విషయం చెప్పగా... ఆయనకు పెళ్ళై, ఇద్దరు పిల్లలున్నారని ఆమెకు చెప్పారట.
మురళీమోహన్ కి పెళ్లయ్యిందంటే శ్రీదేవి తల్లి నమ్మలేదట. ఒకరోజు మురళీమోహన్ ఇంటికి వచ్చి ఆయన ఫ్యామిలీని చూసి కన్ఫర్మ్ చేసుకున్నారట. ఈ విషయం మురళీమోహన్ కి కానీ అటు శ్రీదేవికి కానీ తెలియదట. మురళీమోహన్ కి ఉన్న మంచి పేరు రీత్యా శ్రీదేవి తల్లి ఆయన్ని అల్లుడు చేసుకోవాలని ఇష్టపడ్డారట. ఆమె అలా అనుకున్నారని నాకు తర్వాత తెలిసిందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
మురళీమోహన్ ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. ఆయన హీరో, సెకండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ రోల్స్ చేశారు. నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
టీడీపీ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎంపీగా పార్లమెంట్ కి వెళ్లారు. చిన్న నటుడైనప్పటికీ మురళీమోహన్ క్రమశిక్షణతో కోట్లు కూడబెట్టారు. ఆయనకు రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి.