ప్రముఖ దర్శక, నటుడు కన్నుమూత, కారణం ఇదే.. తాను తీసిన సినిమాలన్నీ అలాంటివే
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ కన్నుమూశారు. నాస్తిక, అభ్యుదయ చిత్రాలతో మెప్పించిన ఆయన మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తమిళ దర్శక, నటుడు వేలు ప్రభాకరన్ కన్నమూత
తమిళ సినిమా వేలు ప్రభాకరన్(68) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. వేలు ప్రభాకరన్ మరణానికి చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన వేలు ప్రభాకరన్
1980లో విడుదలైన `ఇవర్గళ్ వితియాసమానవర్గళ్` అనే చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమయ్యారు వేలు ప్రభాకరన్. ఆ తర్వాత 1989లో విడుదలైన `నాలయ మనిదన్` చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తారు.
ఆ చిత్రం విజయవంతం కావడంతో దాని రెండవ భాగాన్ని `అతిశయ మనిదన్` పేరుతో 1990లో తెరకెక్కించారు. ఆ తర్వాత ఆర్.కె.సెల్వమణి నిర్మించిన `అసురన్`, `రాజాకిలి` అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు వేలు ప్రభాకరన్. ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
దర్శకుడిగా సక్సెస్ కాలేని వేలు ప్రభాకరన్
ఆ తర్వాత అరుణ్ పాండియన్‌తో `కడవుళ్`, నెపోలియన్‌తో `శివన్`, సత్యరాజ్‌తో `పురాచ్చిక్కారన్` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వేలు ప్రభాకరన్‌కు విజయం అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ఆయన చాలా వరకు నాస్తిక, అభ్యుద, విప్లవాత్మక చిత్రాలను రూపొందించారు. సమాజంలోని రుగ్మతలకు పెద్ద పీఠ వేశారు. అవి ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో సినిమాలకు దర్శకత్వం వహించడం మానేసి నటనపై దృష్టి సారించారు. `పదినారు`, `గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్`, `కడవర్`, `పిజ్జా 3`, `రైడ్`, `వెపన్`, `గజన` వంటి చిత్రాలలో నటించారు వేలు ప్రభాకరన్.
60ఏళ్ల వయసులో వేలు ప్రభాకరన్ రెండో పెళ్లి
వేలు ప్రభాకరన్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన మొదట పి. జయదేవిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2017లో, 60 ఏళ్ల వయసులో నటి షిర్లీ దాస్‌ను రెండో వివాహం చేసుకున్నారు. నటి షిర్లీ దాస్ వేలు ప్రభాకరన్‌తో `కాదల్ కాదల్` అనే చిత్రంలో పనిచేశారు.
60 ఏళ్ల వయసులో నటిని రెండో వివాహం చేసుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఆయన అనారోగ్యంతో మరణించిన వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

