- Home
- Entertainment
- Arjun Sarja: కూతురిపై తప్పుడు ప్రచారం, దానికి బానిస అయింది అంటూ.. అర్జున్ స్ట్రాంగ్ రియాక్షన్
Arjun Sarja: కూతురిపై తప్పుడు ప్రచారం, దానికి బానిస అయింది అంటూ.. అర్జున్ స్ట్రాంగ్ రియాక్షన్
నటుడు అర్జున్ సర్జా తన కూతురు ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్
నటుడు, దర్శకుడు అయిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్ల మీద తీవ్రంగా మండిపడ్డారు. ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేయడం ఆపాలని ఆయన బహిరంగంగా కోరారు.
ఇటీవల తన చిన్న కూతురు అంజన పెళ్లికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఆయన ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ఇలా తన కుటుంబానికి సంబంధించిన ఒక ప్రైవేట్ విషయంపై బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుందని తానెప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కూతురి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం ఇష్టం లేదు!
ఐశ్వర్య వ్యక్తిగత జీవితం గురించి ఇంతకాలం తాను ఎందుకు సైలెంట్‌గా ఉన్నానో అర్జున్ వివరించారు. ప్రతి మహిళకూ సొంత నిర్ణయాలు తీసుకునే, స్వతంత్రంగా బతికే హక్కు ఉంటుందని తాను నమ్ముతానన్నారు. అందుకే తన కూతురి విషయాల్లో తాను జోక్యం చేసుకోలేదని, ఆమె నిర్ణయాలను గౌరవించానని చెప్పారు.
కానీ, ఇప్పుడు తన కూతురి క్యారెక్టర్‌పై అత్యంత నీచమైన, అబద్ధపు ఆరోపణలు వస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయానన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళను ఆల్కహాల్ కి బానిసగా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
పబ్లిసిటీ కోసం క్యారెక్టర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
మీడియాలోని కొన్ని వర్గాల తీరుపై కూడా అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా, పబ్లిసిటీ కోసమే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిజం చెప్పడం కంటే వార్తలను అమ్ముకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం బాధాకరం అన్నారు. పబ్లిక్ ఫిగర్స్ జీవితాల గురించి చర్చలు జరగవచ్చు కానీ, ఆ నెపంతో ఒకరి క్యారెక్టర్‌ను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
కూతురికి అండగా నిలిచిన అర్జున్
ఇది కేవలం తన కుటుంబానికి సంబంధించిన విషయం కాదన్న అర్జున్, సొంత నిర్ణయాలు తీసుకున్న పాపానికి మహిళలు సమాజంలో అనవసరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలు మహిళల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ముఖ్యంగా కుటుంబ అండ లేని మహిళలకు ఇది మరింత కష్టమని చెప్పారు.
గౌరవంగా, స్వేచ్ఛగా బతికే తన కూతురి హక్కుకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని అర్జున్ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ కుటుంబం తరపున సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 'గౌరవం, మర్యాద విషయంలో ఎప్పటికీ రాజీపడేది లేదు' అంటూ అర్జున్ తన స్టేట్మెంట్ను ముగించారు.













