- Home
- Entertainment
- విజయశాంతికి పాట పాడితే రెండు రోజులు రెస్ట్ తీసుకోవల్సిందే.. స్టార్ సింగర్ చిత్ర సంచలన కామెంట్స్..
విజయశాంతికి పాట పాడితే రెండు రోజులు రెస్ట్ తీసుకోవల్సిందే.. స్టార్ సింగర్ చిత్ర సంచలన కామెంట్స్..
పాటలు పాడటం అంత తేలికైన విషయం కాదన్నారు స్టార్ సింగర్ చిత్ర. కొన్ని పాటలు తన గాత్రానికి పరీక్షపెట్టినట్టు ఉంటాయని ఆమె అన్నారు. ముఖ్యంగా విజయశాంతి పాటలు పాడినప్పుడు ఆమె ఎంత ఇబ్బంది పడేవారో తెలుసా?

గట్టిగా అరిచి పాడిన సందర్భాలు..
దక్షిణ భారత సినీ సంగీతంలో తన మధురమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన ప్రముఖ గాయని చిత్ర, తన కెరీర్లోని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక్కో పాట ఒక్కో రకమైన భావాన్ని ఇస్తుందని, కొన్నిసార్లు గట్టిగా అరిచి పాడినట్టుగా, మరికొన్నిసార్లు చాలా హస్కీగా పాడాల్సి వస్తుందని ఆమె వివరించారు. ప్రతిరోజూ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇవాళ ఎలాంటి పాట పాడాల్సి వస్తుందో ముందే తెలియదని ఆమె అన్నారు.
విజయశాంతికి పాట పాడితే 2 రోజులు రెస్ట్ తప్పదు..
ఆ కాలంలో విజయశాంతి గారికి తాను పాడిన పాటల గురించి చిత్ర ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ పాటలు పాడాల్సి వచ్చేదని, ఆ తర్వాత తన గొంతుకు రెండు రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిన సందర్భాలు కూడా ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. అలాంటి పాటలు పాడటం నిజంగానే ఒక పెద్ద సవాలు అని ఆమె పేర్కొన్నారు.
గమకాల వెనుక సాధన
గమకాలను అంత సులువుగా, ఏ స్వరమూ అటు ఇటు కదలకుండా అంత ఖచ్చితంగా ఎలా పాడగలుగుతున్నారు అన్న ప్రశ్నకు, అది చిన్నప్పటి సాధన వల్లే సాధ్యమైందని చిత్ర తెలిపారు. కాలేజీ రోజుల్లో సంగీతాన్ని ప్రధాన సబ్జెక్టుగా తీసుకున్నానని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేర్వేరు గురువులు కీర్తనలు, వర్ణాలు నేర్పించేవారని చెప్పారు. సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత ఓమనకుట్టి టీచర్ వద్దకు వెళ్లి మరింత సంగీతం అభ్యసించినట్లు వివరించారు.
తల్లిదండ్రుల నియమాలు, ఇంట్లో ప్రాక్టీస్
ఇంటికి వచ్చిన తర్వాత కూడా సంగీత అభ్యాసం కొనసాగేదని చిత్ర చెప్పారు. తన తల్లిదండ్రులు చాలా కఠినంగా ఉండేవారని, దేవుడి ముందు దీపం వెలిగించి గంటసేపు కూర్చునేవారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తమ్ముడు మృదంగం వాయించేవాడని, తాను, అక్క కలిసి పాడేవారని తెలిపారు. అక్కకు తెలిసిన కీర్తనలు పాడుతున్నప్పుడు తాను వింటూ నేర్చుకునేదాన్నని చిత్ర చెప్పారు.
అక్కతో కలిసి సంగీత సాధన..
కాలేజీలోనూ, ఓమనకుట్టి టీచర్ దగ్గర నేర్చుకున్న విషయాలను ఇద్దరూ పంచుకునేవారని చిత్ర తెలిపారు. అమ్మ కూడా కొన్ని చిన్న కీర్తనలు నేర్పించేవారని, ప్రతిరోజూ పాడేటప్పుడు దేవుడికి సంబంధించిన కీర్తనలు ఎక్కువగా పాడేవారని చెప్పారు. అక్క ఏ కీర్తన నేర్చుకున్నా తాను వింటూ ఉండేదాన్నని, మరుసటి రోజు దాన్ని పాడేదాన్నని చిత్ర అన్నారు.













