- Home
- Entertainment
- Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్ నుంచి ఆది వరకు
Heroes Come Back: 2025లో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన 10 మంది హీరోలు వీరే.. పవన్ నుంచి ఆది వరకు
Heroes Come Back: చాలా మంది స్టార్ హీరోలు చాలా రోజులుగా విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కొందరికైతే కొన్ని ఏళ్లుగా సక్సెస్ లేదు. అలాంటి పది మంది హీరోలు ఈ ఏడాది సక్సెస్ అందుకొని అదిరిపోయేలా కమ్ బ్యాక్ ఇచ్చారు.

2025 ఏడాది కమ్ బ్యాక్ అయిన హీరోలు వీరే
2025 ఏడాది కొందరు హీరోలకు చాలా స్పెషల్. వరుస పరాజయాల్లో ఉన్న హీరోలకు లైఫ్ ఇచ్చింది. కమ్ బ్యాక్ అయ్యేలా చేసింది. పవన్ కళ్యాణ్ నుంచి ఆది సాయికుమార్, రోషన్ వరకు ఇలా దాదాపు పది మంది హీరోలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అది అదిరిపోయే కమ్ బ్యాక్ కావడం విశేషం. మరి ఆ హీరోలు ఎవరు? వాళ్లు విజయాలు సాధించిన చిత్రాలేంటి? అనేది తెలుసుకుందాం.
ఓజీతో పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత `ఓజీ`తో హిట్ అందుకున్నారు. `అత్తారింటికి దారేదీ` తర్వాత పవన్ కి సాలిడ్ హిట్ పడలేదు. ఈ క్రమంలో `ఓజీ`తో ఆయన ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాఫియా గ్యాంగ్ స్టర్ మూవీ సుమారు మూడు వందల కోట్ల వరకు వసూలు చేసింది. ఇది పవన్ అభిమానుల ఆకలి తీర్చింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా మైండ్ బ్లోయింగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆయనకు `ఎఫ్ 2` తర్వాత సక్సెస్ రాలేదు. చాలా సినిమాలు చేశారు, కానీ డిజప్పాయింట్ చేశాయి. యాక్షన్ సినిమాలు కూడా మెప్పించలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో సంక్రాంతికి వచ్చారు. ఇండస్ట్రీని షేక్ చేసే హిట్‌ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.300కోట్ల గ్రాస్ వసూలు చేసి, అందరికి షాకిచ్చింది. ఇందులో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు.
కుబేరతో నాగార్జున
మరో సీనియర్ హీరో నాగార్జున కూడా కమ్ బ్యాక్ ఇచ్చారు. గతేడాది `నా సామి రంగ` చిత్రంతో డీసెంట్ హిట్‌ని అందుకున్నారు. కానీ ఈ ఏడాది ఆయన క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. `కుబేర` చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ ధనుష్ కంటే నాగార్జునకే ఎక్కువగా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.
అనగనగ మూవీతో సుమంత్
మరో సీనియర్ హీరో సుమంత్ కి కూడా హిట్ పడింది. ఆయన `అనగనగ` అనే చిత్రంలో నటించారు. ఇది ఓటీటీలో విడుదలయ్యింది. కానీ తర్వాత మంచి ప్రశంసలందుకుంది. మంచి ఆదరణ పొందింది. అత్యధికంగా వీక్షించిన మూవీగా నిలిచింది. సుమంత్‌కిది మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
తండేలో తో నాగచైతన్య
మరో అక్కినేని హీరో నాగచైతన్యకి కూడా కమ్ బ్యాక్ ఇచ్చింది 2025. ఆయన `తండేల్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. వరుస పరాజయాల్లో ఉన్న చైతూ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది.
మిరాయ్ తో మంచు మనోజ్
మంచు మనోజ్ సినిమాలు చేయక దాదాపు ఏడేళ్లు అవుతుంది. మధ్యలో రెండు మూడు సినిమాలు స్టార్ట్ చేశారు. కానీ అవి ఆదిలోనే ఆగిపోయాయి. మరోవైపు వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు `మిరాయ్` చిత్రంతో విలన్‌గా మారారు. ఈ మూవీబ్లాక్ బస్టర్‌గా నిలిచి, హీరో తేజ సజ్జా కంటే విలన్‌గా నటించిన మంచు మనోజ్‌కే ఎక్కువ పేరుని తీసుకొచ్చింది. మనోజ్ పాత్ర కూడా హైలైట్ అయ్యింది. మొత్తంగా మనోజ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. నెక్ట్స్ ఆయన హీరోగానూ మూవీ చేస్తున్నారు.
ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ పోతినేని
రామ్ పోతినేనికి `ఇస్మార్ట్ శంకర్` తర్వాత హిట్ లేదు. చాలా సినిమాలు చేశాడు. కానీ అవి ఆడలేదు. ఈ ఏడాది `ఆంధ్ర కింగ్ తాలూకా` చిత్రంలో నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ఈ మూవీ యావరేజ్‌గా ఆడింది. నష్టాలనే తీసుకొచ్చింది. కానీ రామ్ కి మాత్రం కమ్ బ్యాక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.
కిష్కింధపురితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి కూడా చాలా రోజులుగా విజయాలు లేవు. హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆయన `కిష్కిందపురి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ కామెడీ హర్రర్ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుని హిట్ అయ్యింది. బెల్లంకొండ హీరోగా బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది.
శంబాలతో ఆది సాయికుమార్
వీరితోపాటు ఆది సాయికుమార్ కూడా ఈ ఏడాది కమ్ బ్యాక్ అయ్యాడు. ఆయనకు హిట్ లేక చాలా ఏళ్లు అవుతుంది. ప్రారంభంలో తప్ప ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు పరాజయం చెందాయి. హీరోగా నిలబడతాడా? లేదా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన `శంబాల` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తోంది. మంచి వసూళ్లని రాబడుతోంది. ఈ మూవీ ఆదిని తిరుగులేని హీరోగా నిలబెట్టిందని చెప్పొచ్చు.
ఛాంపియన్‌తో రోషన్ మేక
ఆదినే కాదు.. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక కూడా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆయన నటించిన `పెళ్లి సందడి`, `నిర్మల కాన్వెంట్` చిత్రాలు పెద్దగా ఆడలేదు. మోహన్ లాల్ మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ క్రిస్మస్ కానుకగా `ఛాంపియన్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు రోషన్. ఈ మూవీ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. కానీ ఓవరాల్‌గా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. క్రిస్మస్‌కి వచ్చిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు ఈ మూవీకే రావడం విశేషం. ఇది రోషన్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.

