పాకిస్తాన్ బౌలర్ తో ఫోటో దిగిన యువరాజ్ సింగ్.. రెండుగా చీలిపోయిన ఫ్యాన్స్..
Yuvraj Singh:టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్ లు కలిసి దిగిన ఓ ఫోటో పై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది.

Image Credit: Getty Images
భారత మాజీ క్రికెటర్, టీమిండియాకు రెండు ప్రపంచకప్ లు అందించడంలో కీలకంగా వ్యవహరించిన యువరాజ్ సింగ్ అమెరికాలో బిజీగా గడుపుతున్నాడు. వర్జీనియా లో జరుగుతున్న యూనిటీ క్రికెట్ టోర్నీలో భాగంగా అక్కడ అతడు యువ క్రికెటర్లకు సలహాలిస్తున్నాడు.
ఇదే టోర్నీకి పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్ కూడా వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి చాలా కాలం అవడంతో ఒకరినొకరు పలకరించుకుని ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ ఫోటోను అసిఫ్.. తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నాడు.
ఫోటోను షేర్ చేస్తూ అసిఫ్.. ‘స్నేహానికి హద్దులుండవు..’ అని రాసుకొచ్చాడు. అసిఫ్ ఈ ఫోటో షేర్ చేసిన కొద్దిసేపటికే ఇది కాస్తా వైరల్ అయింది.
దీనిపై ఇరు దేశాలకు చెందిన ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. గ్రౌండ్ లోకి దిగితే నువ్వా నేనా..? అని తలపడే ఇరు దేశాల ఆటగాళ్లు.. బయట కలిసినప్పుడు ఇలా స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం చూడటానికి భాగుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
ఇదే సమయంలో మరికొంతమంది మాత్రం.. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డ ఆటగాడు, అది కూడా శత్రుదేశానికి చెందిన వ్యక్తితో అంత క్లోజ్ గా ఫోటో దిగాల్సిన అవసరమేమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువీని తప్పుబడుతున్నారు.
పాక్ తరఫున ఆడింది తక్కువ మ్యాచులే అయినా అసిఫ్.. గొప్ప ప్రదర్శనలు చేశాడు. పాకిస్తాన్ తరఫున 72 మ్యాచులు ఆడి 168 వికెట్లు తీశాడు. అయితే అతడి ప్రవర్తన కారణంగా కెరీర్ మొత్తం వివాదాలే చుట్టుముట్టాయి. నిషేధిత డ్రగ్స్ వాడి కొద్దికాలం పాటు సస్పెండ్ అయిన అసిఫ్.. ఆ తర్వాత 2010 లో ఇంగ్లాండ్ తో లార్డ్స్ లో జరిగిన టెస్టులో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు. దీంతో ఐసీసీ అతడిపై ఏడేండ్ల పాటు నిషేధం విధించింది.
అయితే తాజా ఫోటో విషయానికొస్తే యువీ దానిని షేర్ చేయలేదు. అసిఫ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసినా యువీని నిందించడం కరెక్ట్ కాదనే వారు కూడా లేకపోలేదు. తన తోటి ఆడిన క్రికెటర్ కలిసినప్పుడు అతడిని పలకరించకుండా ముఖం చాటేసుకుని వెళ్లడం కూడా క్రీడా స్ఫూర్తి అనిపించుకోదు అని కామెంట్స్ చేస్తున్నారు.