- Home
- Sports
- Cricket
- Virat Kohli: ప్చ్.. విండీస్‌తో నువ్వు ఆడి ఉండాల్సింది.. ఫామ్ పొందేవాడివేమో.. ట్విటర్‌లో ఆసక్తికర చర్చ
Virat Kohli: ప్చ్.. విండీస్‌తో నువ్వు ఆడి ఉండాల్సింది.. ఫామ్ పొందేవాడివేమో.. ట్విటర్‌లో ఆసక్తికర చర్చ
WI vs IND: పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకున్నాడు. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం అతడు ఈ సిరీస్ ఆడి ఉండాల్సింది అంటున్నారు.

మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోలేక విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లకుండా ప్రస్తుతం పారిస్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. విండీస్ తో వన్డే సిరీస్ తో పాటు టీ20 లకు కూడా అతడు విశ్రాంతి కోరుకున్నాడు.
అయితే కరేబియన్ జట్టుతో తొలి వన్డేలో ఫామ్ లో లేని శిఖర్ ధావన్, సుమారు రెండేండ్ల తర్వాత వన్డేలలోకి అరంగేట్రం చేసిన శుభమన్ గిల్ తో పాటు గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ లు ఫామ్ అందుకోవడంతో పాటు మంచి ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ట్విటర్ లో అభిమానులు ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడితే బాగుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పలువురు నెటిజన్లు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్చ్.. విరాట్ కోహ్లీ వెస్టిండీస్ తో సిరీస్ ఆడి ఉండాల్సింది. ఈ సిరీస్ ఆడితే అతడు తన ఫామ్ ను పొందేవాడు. గొప్ప ఛాన్స్ ను కోహ్లీ మిస్ చేసుకున్నాడు..’ అని కామెంట్ చేశాడు.
మరో నెటిజన్.. ‘కోహ్లీ ఈ సిరీస్ ఆడితే బాగుండేది. అతడు వంద కొట్టకపోయినా కనీసం 50 ప్లస్ స్కోరు చేసినా అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగేది. ఆ తర్వాత సెంచరీ చేయడం పెద్ద కష్టమేం కాదు. కోహ్లీ ఇంక రెస్ట్ చాలు. ఒక కోహ్లీ ఫ్యాన్ గా అడుగుతున్నా. ఇక విరామం మాని ఆటమీద దృష్టి పెట్టు...’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
‘ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ 97 పరుగులతో తృటిలో సెంచరీ కోల్పోయి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శుభమన్ గిల్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించాడు. కోహ్లీ... నిన్ను మేం చాలా మిస్ అవుతున్నాం. నువ్వు కూడా ఈ సిరీస్ ఆడుంటే ఫామ్ పొందేవాడివేమో.. వి మిస్ యూ..’ అని ట్వీట్ చేశాడు.
ఇదిలాఉండగా విండీస్ సిరీస్ తో ఆడకపోయినా కోహ్లీని త్వరలో జరుగబోయే జింబాబ్వే సిరీస్ లో అయినా అతడిని ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అనామక జట్టుతో ఆడితే అయినా కోహ్లీ తన ఫామ్ తిరిగి పొందుతాడని.. అప్పుడు అతడి ఆత్మ విశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.