- Home
- Sports
- Cricket
- ప్రపంచంలో బెస్ట్ బౌలర్‌ను మీ దగ్గర పెట్టుకుని అతడిని ఎంపిక చేయకపోవడమేంటి? భారత సెలక్టర్లపై బ్రెట్ లీ విమర్శలు
ప్రపంచంలో బెస్ట్ బౌలర్‌ను మీ దగ్గర పెట్టుకుని అతడిని ఎంపిక చేయకపోవడమేంటి? భారత సెలక్టర్లపై బ్రెట్ లీ విమర్శలు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుపై స్వదేశంలో పెద్దగా విమర్శలు రాకపోయినా విదేశాలలో మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయమై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసినా గాయం కారణంగా అతడు మెగా టోర్నీకి దూరమయ్యాడు. తాజాగా స్టాండ్ బైలో ఉన్న దీపక్ చాహర్ కూడా గాయంతో కోలుకోకపోవడంతో తప్పుకున్నాడు.
అయితే బుమ్రా రిప్లేస్మెంట్ గా మహ్మద్ షమీని ఎంపిక చేయనున్న భారత జట్టు.. చాహర్ స్థానంలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లను పంపనుంది. దీనిపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ విమర్శలు గుప్పించాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బంతులు విసురుతున్న ఉమ్రాన్ మాలిక్ ను కాదని మిగతావాళ్లను ఎంపిక చేయడమేంటని విమర్శించాడు.
బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ సెలక్లర్లు అతడిని పక్కనబెట్టారు. ప్రపంచంలో అత్యుత్తమ కారును మీ దగ్గర పెట్టుకుని దానిని ఉపయోగించకుండా గ్యారేజ్ లో పడేస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం..? అప్పుడు ఆ కారుకు విలువుంటుందా..? ఉమ్రాన్ మాలిక్ ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసి ఉండాల్సింది.
అతడు యువకుడే కావొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేకపోవచ్చు. కానీ ఉమ్రాన్.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరగలిగే సత్తా ఉన్నోడు. ఆస్ట్రేలియాలో పేస్ బౌలర్లు సమర్థవంతంగా రాణిస్తారు..’ అని తెలిపాడు.
Image credit: Getty
బుమ్రా లేకపోవడం భారత జట్టుకు లోటు అని దీంతో ఆ బరువును ఇప్పుడు భువనేశ్వర్ మోయాల్సి వస్తుందని తెలిపాడు. అయితే బుమ్రా లేకున్నా భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయగలదని ధీమా వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన టీమిండియా.. గురువారం మరో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లు ఆడుతుంది. ఈనెల 23న పాకిస్తాన్ తో పోరుతో ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.