‘రూ. 60 లక్షలతో కొన్నోడు అదరగొడుతున్నాడు.. రూ. 18 కోట్ల ఆటగాడు ఏం చేశాడు..?’
IPL 2023: ఐపీఎల్ - 16 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన వేలం ప్రక్రియలో పంజాబ్ కింగ్స్.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ను రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ - 16లో భాగంగా ప్లేఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పరిస్థితులు ఏ మాత్రం తమకు అనుకూలంగా లేని చోట పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుతంగా రాణించాడు. నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ 167 స్కోరు చేయగా అందులో ప్రభ్‌సిమ్రన్ చేసినవే 103 పరుగులు కావడం గమనార్హం.
శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట ప్రభ్‌సిమ్రన్ అద్భుతంగా రాణించి పంజాబ్ కు ఫైటింగ్ టోటల్ అందించాడు. ఈ పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు సీజన్ ఆరంభంలో కూడా కేకేఆర్, రాజస్తాన్ లపై కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Image credit: PTI
తాజాగా ప్రభ్‌సిమ్రన్ పై టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్ కు ముందు వేలంలో పంజాబ్ రూ. 18.5 కోట్లతో కొనుగోలు చేసిన సామ్ కరన్ కంటే రూ. 60 లక్షలతో దక్కించుకున్న ప్రభ్‌సిమ్రన్ చాలా బెటర్ అని వ్యాఖ్యానించాడు.
పంజాబ్ తో మ్యాచ్ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్ బజ్ లో మాట్లాడుతూ... ‘పంజాబ్ జట్టు అవకాశాలను ప్రభ్‌సిమ్రన్ మరింత మెరుగుపరిచాడు. ఈ సీజన్ మొత్తం అతడు నిలకడగా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో అతడిని రూ. 60 లక్షలకే దక్కించుకుంది పంజాబ్. కానీ అతడు తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. తాను సెంచరీలు కూడా కొట్టగలనని నిరూపిస్తున్నాడు.
Image credit: PTI
మీరు (పంజాబ్ కింగ్స్) సామ్ కరన్ ను రూ. 18.5 కోట్లకు కొన్నారు. అతడేం చేశాడు..? ఏమైనా భారీ ఇన్నింగ్స్ ఆడాడా..?’ అని కామెంట్ చేశాడు. ఈ ఏడాది సామ్ కరన్.. 12 మ్యాచ్ లు ఆడి 11 ఇన్నింగ్స్ ఆడి 216 పరుగులే చేశాడు. ఈ క్రమంలో అతడి సగటు 24గా ఉండగా స్ట్రైక్ రేట్ కూడా 129 గానే ఉంది. బౌలింగ్ లో కరన్.. 12 మ్యాచ్ లలో ఏడు వికెట్లు మాత్రమే తీశాడు.
Image credit: PTI
ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడి 334 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. స్ట్రైక్ రేట్ కూడా 153.92గా ఉంది. 2019 నుంచి పంజాబ్ తో ఆడుతున్నా ఈ సీజన్ లో ఓపెనర్ గా వచ్చిన ప్రభ్‌సిమ్రన్ నిలకడగా ఆడుతూ ధావన్ కు బెస్ట్ ఓపెనింగ్ జోడీ అనిపించుకుంటున్నాడు.