Ranji Trophy: సచిన్, రోహిత్ ల సరసన నిలిచిన జైస్వాల్.. రంజీలలో అరుదైన ఘనత
Yashasvi Jaiswal: ముంబై యువ ఆటగాడు, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్ రంజీ ట్రోఫీలలో అరుదైన ఘనత సాధించాడు. అతడు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలతో సమానంగా నిలిచాడు.

ముంబై రంజీ జట్టు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ రంజీలలో అరుదైన ఘనత సాధించాడు. ఒకే మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అతడు దిగ్గజాల సరసన నిలిచాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా ఇటీవలే ఉత్తరప్రదేశ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ లో అతడు రెండు సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో రంజీ సెమీస్ లో ఒకే టెస్టులో రెండు సెంచరీలు సాధించిన ముంబై ఆటగాళ్ల జాబితాలో ఆరో ఆటగాడిగా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ, అజింక్యా రహానే, వినోద్ కాంబ్లీ, వసీం జాఫర్ ల పేరిట ఉండేది. వీళ్లంతా ఒకే మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేశారు.
ఇప్పుడు ఆ జాబితాలో జైస్వాల్ కూడా చేరాడు. యూపీతో తొలి ఇన్నింగ్స్ లో 100 పరుగులు చేసి అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 181 పరుగులతో చెలరేగాడు. కాగా ఈ ఘనతపై జైస్వాల్ స్పందించాడు.
‘నాకు ఈ రికార్డు గురించి తెలియదు. నేను డ్రెస్సింగ్ రూమ్ కు వెల్లగానే అందరూ నన్ను అభినందించారు. ఏమైందని అడగగా అసలు విషయం చెప్పారు. సచిన్ సార్, రోహిత్, రహానే ల పక్కన నా పేరు చూసుకోవడం గర్వంగా ఉంది..’ అని తెలిపాడు.
కాగా.. రంజీ ట్రోఫీ-2022 లో ముంబై జట్టు ఫైనల్ చేరింది. రంజీలలో ముంబైకి ఇది 47వ ఫైనల్ కావడం గమనార్హం. ఇప్పటివరకు 41 ట్రోఫీలు నెగ్గిన ముంబై.. 42వ టైటిల్ పై కన్నేసింది.
పృథ్వీ షా సారథ్యంలోని ముంబై రంజీ జట్టు జూన్ 22 నుంచి బెంగళూరు వేదికగా మధ్యప్రదేశ్ తో తలపడబోతుంది. 23 ఏండ్ల తర్వాత రంజీ ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.