ఆసీస్ బ్యాటర్లకు రన్స్ చేయమని ఫీల్డింగ్ సెట్ చేశావా..? రోహిత్‌పై దాదా ఫైర్
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీ, తుది జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భారత సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీ నిర్ణయాలు చెత్తగా ఉన్నాయని, తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేయకపోవడం ఘోర తప్పిదమని అంటున్నాడు మాజీ సారథి సౌరవ్ గంగూలీ. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా తొలి రోజు ఆటలో రోహిత్ కెప్టెన్సీ.. మరీ చెత్తగా ఉందని దాదా వాపోయాడు.
ఆసీస్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు వీలుగా ఫీల్డింగ్ సెట్ చేసినట్టు ఉందని దాదా విమర్శలు గుప్పించాడు. దాదాతో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ చేసిన ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అయింది.
తొలి రోజు మ్యాచ్ జరుగుతున్న క్రమంలో దాదా మాట్లాడుతూ.. ‘టీమిండియా ఆట తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఒకదశలో ఆసీస్ 76-3 గా ఉన్నప్పుడు మ్యాచ్ పై ఆధిపత్యం చెలాయించిల్సింది పోయి చేతులెత్తేసింది. ప్రత్యర్థి బ్యాటర్లు మన ఫీల్డింగ్ వైఫల్యాలను ఆసరాగా తీసుకుని భారీగా పరుగులు సాధించారు.
లంచ్ బ్రేక్ తర్వాత వికెట్ సాధించిన భారత్ అనంతరం లయ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ తో పాటు స్మిత్ కూడా పరుగులు చేసే విధంగా ఫీల్డింగ్ సెట్ చేసినట్టుగా ఉంది. అతడు ఫామ్ లో ఉన్న మాట వాస్తవమే గానీ ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయిన దశలో వచ్చిన హెడ్ ఈజీగా పరుగులు చేశాడు. అతడిని కట్టడి చేసే విధంగా టీమిండియా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ లేదు. అతడు అలవోకగా పరుగులు సాధిస్తున్నా రోహిత్ ఫీల్డర్లను మార్చలేదు..’అని వాపోయాడు.
ఇక అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న దాదా.. తాను కెప్టెన్ అయితే మాత్రం అశ్విన్ వంటి ప్లేయర్ ను తుది జట్టు నుంచి తప్పించనని చెప్పుకొచ్చాడు. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ ఫార్ములా అన్నివేళలా వర్కవుట్ కాదని దాదాతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో అశ్విన్ ను తప్పించడం దారుణమని అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్ కు విరాట్ సారథిగా లేకపోవడం నిరుత్సాహం కలిగించిందని, కోహ్లీ కెప్టెన్సీలోని దూకుడు ఇప్పుడు లేదని పేర్కొన్నాడు. అశ్విన్ ను తప్పించడం దారుణమన్న హర్షవర్ధన్.. బుమ్రా దూరం కావడం కూడా భారీ నష్టాన్ని కలిగించిందని ట్వీట్ చేశాడు.