వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా క్రికెటర్‌కి ఆర్థిక కష్టాలు... బతుకు తెరువు కోసం కార్పెంటర్‌గా మారి...
క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వరల్డ్‌కప్‌లు సాధించిన జట్టు ఆస్ట్రేలియా. కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా, ఇప్పుడు మునుపటి జోష్‌ను చూపించలేకపోయినా, మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది. అయితే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న క్రికెటర్ మాత్రం బతుకు తెరువు కోసం కార్పెంటర్‌గా మారాడట.
క్రికెటర్లకు అత్యధిక మొత్తం వేతనం చెల్లించే క్రికెట్ బోర్డులలో క్రికెట్ ఆస్ట్రేలియా ఒకటి. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ జావియర్ దోహర్టీ... ఆర్థిక కష్టాలు భరించలేక కార్పెంటర్‌గా మారాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2001 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన జావియర్ దోహర్టీ, మైకేల్ క్లార్క్ కెప్టెన్సీలో 2015 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
వన్డే వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన దోహర్టీ, ఏడు ఓవర్లలో 60 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. దీంతో ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. 34 ఏళ్ల వయసులో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన దోహర్టీ, ప్రస్తుతం పొట్టకూటి కోసం కార్పెంటర్ వృత్తిని ఎంచుకున్నాడు.
దోహర్టీకి ఆర్థిక సాయం చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. అయితే దోహర్టీ మాత్రం అందుకు నిరాకరించాడు. ‘ఇప్పుడు నేను కార్పెంటర్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతీరోజూ ఇలా సైట్స్‌కి వెళ్లి, పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ఇది క్రికెట్‌కి పూర్తిగా భిన్నమైనది.
నేను క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏం చేయాలనే దానిపై క్లారిటీ లేకపోయింది. రిటైర్మెంట్ తర్వాత ఏడాదిపాటు నాకు వచ్చిన ప్రతీ పనిని నేర్చుకోవడం మొదలెట్టాడు.
ల్యాండ్ స్కేపింగ్, ఆఫీస్ వర్క్, క్రికెట్ వర్క్... ఇలా ఎన్నో పనులు చేశాను. కానీ కార్పెంటర్ పనిలోనే నాకు కిక్ దొరికింది.. నాకు ఆర్థిక సాయం చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. కానీ నాకు ఇప్పుడు ఎవరి సాయం అవసరం లేదు’ అంటూ తెలిపాడు దోహర్టీ.
ఆస్ట్రేలియా తరుపున నాలుగు టెస్టులు, 60 వన్డేలు ఆడిన దోహర్టీ, టెస్టుల్లో ఏడు, వన్డేల్లో 55 వికెట్లు పడగొట్టాడు. మార్చి 2020లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆస్ట్రేలియా లెజెండ్స్ తరుపున ఆడాడు దోహర్టీ.