'ఐపీఎల్‌ది ఏముంది.. ఏడాదికోసారి జరుగుతుంది.. ఒక్క సీజన్లో ఆడకుంటే నష్టమేమీ లేదు.. కానీ..!'
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఈ ఏడాది మార్చి మాసాంతంలో మొదలుకావాల్సి ఉంది. ఇప్పటికే మినీ వేలం ముగిసిన ఐపీఎల్ ఈ ఏడాది నుంచి కొత్త హంగులతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే ఏడాది భారత్ లో వన్డే ప్రపంచకప్ కూడా జరుగుతుంది.
క్రికెట్ ప్రేమికులను గత పదిహేనేండ్లుగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ యేడు కూడా సరికొత్త హంగులతో రానున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఖాళీ స్టేడియాల్లో జరిగిన మ్యాచ్ లతో ఈ లీగ్ క్రేజ్ కాస్త తగ్గిందన్న అనుమానాలు నెలకొన్నాయి. కానీ గతేడాది అహ్మాదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య ఫైనల్ కు సుమారు లక్ష మంది దాకా హాజరై ఐపీఎల్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదని నిరూపించారు.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో స్టార్లు లేకుండానే పలు ఫ్రాంచైజీలు ఆడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వన్డే ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో టీమిండియాకు చెందిన కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి కీలక ఆటగాళ్లకు విరామం ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా దిగ్గజం, 2011లో వన్డే వరల్డ్ కప్ విజేత గౌతం గంభీర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.
గంభీర్ మాట్లాడుతూ.. ‘ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా భవిష్యత్ ప్రణాళిక ఉంది. భారత్ లక్ష్యం కూడా వరల్డ్ కప్ నెగ్గడమే కావాలి. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలు అర్థం చేసుకోవాలి. ఆయా ఫ్రాంచైజీలలో ఉన్న స్టార్లకు విరామమివ్వాలి. దీనివల్ల అవి కాస్తా ఇబ్బందులు పడొచ్చు.
కానీ ఐపీఎల్ అనేది ప్రతీ ఏడాది జరుగుతుంది. వన్డే ప్రపంచకప్ అలా కాదు. ప్రతీ నాలుగేండ్లకోసారి మాత్రమే దానిని నిర్వహిస్తారు. ఒక్క సంవత్సరం ఐపీఎల్ మిస్ అయితే పోయే నష్టమేమీ లేదు. నా అభిప్రాయం ప్రకారమైతే ఐపీఎల్ కంటే వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం ముఖ్యం. ఆటగాళ్లు కూడా ఒక్క ఐపీఎల్ సీజన్ ఆడకుంటే వచ్చే నష్టమేమీ లేదు.
ఇక ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అత్యుత్తమ జట్టును సిద్ధం చేయాలి. ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే టీ20 సిరీస్ లకు ఇవ్వాలేగానీ వన్డేలలో మాత్రం ఇవ్వొద్దు. ప్రపంచకప్ కు బరిలోకి దిగబోయే జట్టు సభ్యులు కలిసి ఆడేలా చూసుకోవాలి. గత రెండేండ్లలో ఇలా చేయకే భారత్ ఐసీసీ టోర్నీలలో విఫలమైంది. పూర్తిస్థాయిలో జట్టును బరిలోకి దింపకనే కీలక టోర్నీలలో విఫలమైంది. ఈసారి మాత్రం అలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని సూచించాడు.
ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా బీసీసీఐ దృష్టి సారించాలని, ఫ్రాంచైజీలతో చర్చించి వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో ఉన్న ప్లేయర్లను ఐపీఎల్ ఆడించకుండా ఉంటేనే మంచిదని గంభీర్ అభిప్రాయపడ్డాడు. గత రెండు ప్రపంచకప్ లలో భారత జట్టు.. సరైన ప్రణాళిక లేకుండా బరిలోకి దిగి చేతులు కాల్చుకున్నదని, ఈసారి మాత్రం అలా జరగకుండా చూసుకోవాలని హితువు పలికాడు.