IND Vs ENG : టీమిండియాకు మరో బిగ్ షాక్ తప్పదా? కెప్టెన్ రోహిత్ ఆడటం అనుమానమే?
ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 లో భాాగంగా నేడు ఇంగ్లాండ్ తో తలపడనున్న టీమిండియా మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Rohit Sharma
లక్నో : స్వదేశంలో జరుగుతున్న ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరగకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఏకైక జట్టు భారత్ మాత్రమే. ఇలా సొంత గడ్డపై టీమిండియా అద్భుత ఆటతీరుతో ఫ్యాన్స్ క్రికెట్ పండగ చేసుకుంటున్నారు. ఇలా మరోసారి వరల్డ్ కప్ విజేతలుగా నిలిచేందుకు దూకుడుగా ముందుకువెళుతున్న భారత జట్టును గాయాలు కలవరపెడుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాక్టీస్ సెషన్ లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Rohit Sharma
ఇంగ్లాండ్ తో మ్యాచ్ కోసం కొద్దిరోజుల క్రితమే టీమిండియా ఆటగాళ్లు లక్నో చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇలా నేటి(ఆదివారం) మ్యాచ్ కోసం నిన్న(శనివారం) ఆటగాళ్లంతా ముమ్మరంగా ప్రాక్టీస్ చేసారు. ఈ క్రమంలో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. బౌలర్ విసిరిన బంతి రోహిత్ కుడిచేతి మణికట్టుకు బలంగా తాకడంతో గాయపడినట్లు... నొప్పితో విలవిల్లాడిపోతూ మైదానాన్ని వీడినట్లు తెలుస్తోంది. టీమిండియా ఫిజియో రోహిత్ గాయాన్ని పరిశీలించి తీవ్రత ఎక్కువగా వుండటంతో ప్రాక్టీస్ కు దూరంగా వుండాలని సూచించినట్లు సమాచారం. దీంతో రోహిత్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు.
Rohit Sharma
రోహిత్ శర్మ గాయం తీవ్రత ఏ స్థాయిలో వుందో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేపట్టినట్లు సమాచారం. ఒకవేళ అతడి గాయం పెద్దదిగా తేలితే ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలున్నాయి. అయితే రోహిత్ గాయంపై ఇటు టీమిండియా మేనేజ్ మెంట్ గానీ, బిసిసిఐ వర్గాలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కు ముందు ఆటగాళ్ళ జాబితా విడుదలతో రోహిత్ గాయం క్లారిటీ రానుంది. ఒకవేళ ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు రోహిత్ దూరమైతే కెప్టెన్సీ బాధ్యత కెఎల్ రాహుల్ కు చేపట్టనున్నారు.
Hardik Pandya
ఇప్పటికే టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడు గాయంనుండి కోలుకోకపోవడంతో ఇవాళ ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో కూడా ఆడటంలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో టీమిండియా సెమీ ఫైనల్ కు ఈజీగా చేరుకోనుండటంతో మరికొన్ని మ్యాచులకు పాండ్యా దూరం కానున్నాడు. గాయంనుండి పూర్తిగా కోలుకుని పూర్తి ఫిట్ నెస్ సాధించాకే అతన్ని బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోందట.
Rohit Sharma
ఇలా ఇప్పటికే వైస్ కెప్టెన్ పాండ్యా ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు దూరంగా వుండటం ఖాయమయ్యింది... ఈ సమయంలో కెప్టెన్ రోహిత్ కూడా ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. మంచి ఫామ్ తో వుండి పరుగులవరద పారిస్తున్న రోహిత్ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. అలాంటిది అతడు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బరిలోకి దిగకుండే అది టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇవాళ్టి మ్యాచ్ లో రోహిత్ ఆడాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.