- Home
- Sports
- Cricket
- దక్షిణాఫ్రికాతో టీ20లకు టీమిండియాలోకి ఉమ్రాన్ మాలిక్..? దాదా ఇంప్రెస్డ్.. మిగిలింది వాళ్లే..
దక్షిణాఫ్రికాతో టీ20లకు టీమిండియాలోకి ఉమ్రాన్ మాలిక్..? దాదా ఇంప్రెస్డ్.. మిగిలింది వాళ్లే..
Sourav Ganguly On Umran Malik: సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను త్వరలోనే టీమిండియాలో చూడబోతున్నామా..? ఈ స్పీడ్ స్టార్ ను భారత జట్టులోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు.

ఐపీఎల్ - 15 లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంగా బంతులు విసరుతూ వరుసగా ఆకట్టుకునే ప్రదర్శనలు చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ భారత జట్టులోకి రావడానికి రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు.
త్వరలో భారత్ లో పర్యటించనున్న దక్షిణాఫ్రికా సిరీస్ కు ఉమ్రాన్ ను భారత జట్టులోకి ఎంపిక చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలన్నీ ముగిసినట్టు తెలుస్తున్నది. తాజాగా ఇదే విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం దానికి సూచికనే అనిపిస్తున్నది.
ఓ టీవీ చానెల్ తో దాదా మాట్లాడుతూ ఉమ్రాన్ పై ప్రశంసలు కురిపించాడు. భారత్ లో ఏ బౌలర్ గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడో తనకు చెప్పండని, అటువంటి బౌలర్ ను జాగ్రత్తగా వాడుకోవాలని వ్యాఖ్యానించాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ‘భారత్ లో ఏ బౌలర్ గంటకు 150 కి.మీ. వేగంతో అదే నిలకడతో బౌలింగ్ చేస్తున్నాడు..? చాలా అరుదు కదా. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ లో అతడు భారత జట్టు తరఫున ఎంపికైనా నేను ఆశ్చర్యపోను.
అతడు చాలా అరుదైన బౌలర్.. ఉమ్రాన్ ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అతడి వేగం అత్యద్భుతం. ఉమ్రాన్ తో పాటు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న కుల్దీప్ సేన్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడి బౌలింగ్ శైలి కూడా చూడముచ్చటగా ఉంది.
ఇక సన్ రైజర్స్ లోనే ఉన్న మరో బౌలర్ టి.నటరాజన్ కూడా మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఐపీఎల్ ద్వారా అతడికి మంచి కమ్ బ్యాక్ దొరికింది. ఇప్పటికే మనకు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ల రూపంలో మంచి పేసర్లున్నారు. అయితే పైన పేర్కొన్న వాళ్లు తుది జట్టులోకి రావడం సెలెక్టర్ల చేతిలో ఉంది...’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్-2022 లో 12 మ్యాచులాడిన ఉమ్రాన్ మాలిక్.. 18 వికెట్లు తీశాడు. ఈ 22 ఏండ్ల కాశ్మీరి కుర్రాడు.. మధ్యలో నాలుగైదు మ్యాచులలో లయ తప్పినా ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో మళ్లీ ఫామ్ అందుకుని 3 వికెట్లతో చెలరేగాడు.
కాగా.. మాలిక్ చాలా అరుదైన బౌలరని, అతడిని జాగ్రత్తగా వాడాలని భారత సీనియర్ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లు అతడిని భారత జట్టులోకి తీసుకోవాలని కోరుతుండగా.. మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ వంటి వాళ్లు ఇప్పుడే అతడి పై భారం మోపొద్దని, ఉమ్రాన్ ఇంకా పరిణితి సాధించాలని అభిప్రాయపడుతున్నారు.
మరి జూన్ 9 నుంచి మొదలుకాబోయే దక్షిణాఫ్రికా సిరీస్ లో ఉమ్రాన్ ను సెలెక్ట్ చేస్తారా..? లేక మరికొన్ని రోజులు వేచి చూసి ఆ అస్త్రాన్ని ప్రపంచ జట్ల మీద ప్రయోగిస్తారా అనేది భారత సెలెక్టర్ల చేతిలో ఉంది. సౌతాఫ్రికా సిరీస్ కోసం మే 25న జట్టును ప్రకటించనున్నారు.