- Home
- Sports
- Cricket
- Retired Out: నేను మొదలెట్టాను.. చాలా మంది ఫాలో అవుతారు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Retired Out: నేను మొదలెట్టాను.. చాలా మంది ఫాలో అవుతారు.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ravichandran Ashwin: ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ కు చేరాడు. అదే విషయమై ఇప్పుడు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగిన తొలి క్రికెటర్ గా రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే రికార్డు సృష్టించాడు. ఈ విధానంలో ఔటైన అశ్విన్.. అప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
క్రికెట్ లో పెద్ద చర్చకు తెరదీసిన ఈ వ్యవహారపై స్వయంగా అతడే స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అశ్విన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఇది (రిటైర్డ్ ఔట్ వ్యూహం) కొన్ని సార్లు వర్కవుట్ అవుతుంది. కొన్ని సార్లు బెడిసికొట్టొచ్చు కూడా. అయితే ఫుట్ బాల్ లో మాత్రం ఇది రెగ్యులర్ గా జరుగుతుంది.
కానీ దానిని టీ20 క్రికెట్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. క్రికెట్ అనేది జట్టుగా ఆడే ఆట. ఇది ఏ ఒక్కరి వల్లో గెలిచేది కాదు. ఒక్కరి వల్లో ఓడేదీ కాదు. ఆ విషయాన్ని ముందుగా మనందరం గుర్తించాలి.
మీరు ఫుట్బాల్ లో చూస్తే.. క్రిస్టియానో రొనాల్డో, మెస్సీలు తరుచూ గోల్స్ చేస్తారు. అయితే వాళ్ల గోల్ కీపర్ కూడా ప్రత్యర్థులు కొట్టే గోల్స్ ను ఆపగలగాలి. అప్పుడే రొనాల్డో గానీ మెస్సీ గానీ వెలుగులోకి వస్తారు.
టీ20లో కూడా అంతే. ఫుట్బాల్ లో సబ్ స్టిట్యూట్ లను తీసుకున్నట్టే నేను కూడా అలాగే చేశాను. అయితే క్రికెట్ లో ఇది ఆలస్యంగా మొదలైందని నేను భావిస్తున్నాను. కానీ వచ్చే రోజుల్లో దీనిని (రిటైర్డ్ ఔట్) చాలా మంది క్రికెటర్లు ఫాలో అవుతారనే నమ్మకం నాకుంది...
రిటైర్డ్ ఔట్ అనేది మన్కడింగ్ (నాన్ స్ట్రైకర్ లో ఉన్న బ్యాటర్ ను బౌలర్ అతడిని ఔట్ చేయడం) మాదిరి కాదు కదా. మన్కడింగ్ లా దీనిపై ఆ స్థాయిలో విమర్శలు రావని నేను నమ్ముతున్నాను..’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఇదే విషయమై అశ్విన్ ఇంకా స్పందిస్తూ.. ‘ఇది వ్యూహంలో భాగమే. రియాన్ పరాగ్ బాగా బ్యాటింగ్ చేస్తాడు. కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్ ముగియగానే నేను మరో ఐదారు బంతులు చూసి వెళ్లిపోదామనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు ఆడలేకపోయాను. ఇంకా పది బంతులు మిగిలున్నాయి.
ఆ సమయంలో రియాన్ వచ్చి ఓ రెండు సిక్సర్లు కొట్టినా జట్టుకు అదెంతో ఉపయోగపడుతుంది కదా... అందుకే నేను రిటైర్డ్ ఔట్ అయ్యాను..’ అని అశ్విన్ తెలిపాడు.