WI vs IND: మూడో టీ20 కూడా గంటన్నర ఆలస్యమే.. కారణం చెప్పిన విండీస్ క్రికెట్ బోర్డ్
WI vs IND T20I: వెస్టిండీస్‌తో రెండో టీ20 అనుకున్న సమయానికంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నేడు జరగాల్సి ఉన్న మూడో టీ20 కూడా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నది.

వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ నిర్వహణ విమర్శలకు తావిస్తున్నది. సోమవారం ముగిసిన రెండో టీ20 జరగాల్సిన సమయం కంటే 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో భారత కాలమానం ప్రకారం.. 8 గంటలకు ప్రారంభంకావాల్సి ఉన్న మ్యాచ్.. 11 గంటలకు మొదలైంది. భారత్ లో ఈ మ్యాచ్ మంగళవారం తెల్లవారుజామున 2.40కు ముగిసింది.
రెండో టీ20కి ముందు భారత ఆటగాళ్ల లగేజీ రాకపోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. మూడు గంటల పాటు మ్యాచ్ ను ఆపినా సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అవేశ్ ఖాన్ ల లగేజీలు అందనే లేదు. దీంతో వాళ్లు అర్ష్‌దీప్ జెర్సీ వేసుకుని బరిలోకి దిగాల్సి వచ్చింది.
ఇక తాజాగా మూడో టీ20 కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుందని విండీస్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటన విడుదలచేసింది. షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్న మ్యాచ్.. 90 నిమిషాల పాటు (గంటన్నర) ఆలస్యంగా మొదలవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
మూడో మ్యాచ్ కు ఆటగాళ్లకు కావాల్సిన విశ్రాంతిని ఇచ్చిన తర్వాతే ఈ మ్యాచ్ ను ప్రారంభిస్తామని ఆటగాళ్లకు విండీస్ క్రికెట్ బోర్డు ముందే చెప్పిందట. దీనికి వాళ్లు ఒప్పుకున్నాకే రెండో మ్యాచ్ జరిపించిందట. అందుకే నేటి మ్యాచ్ ను భారత కాలమానం ప్రకారం 8 గంటలకు బదులు 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
‘విండీస్-ఇండియా మధ్య జరిగే మూడో మ్యాచ్ కూడా ఆలస్యమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా తెలిపింది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు మొదలవుతుంది. సోమవారం మ్యాచ్ ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది.
Image credit: Getty
అయితే ఈ మ్యాచ్ కు ముందే.. మేము మూడో మ్యాచ్ కు కావాల్సినంత విశ్రాంతినిస్తామని ఆటగాళ్లకు మాటిచ్చాం. దాంతో ఇరుజట్లు మ్యాచ్ ఆడేందుకు సమ్మతించాయి..’ అని వెస్టిండీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసిన ఈ ఐదు మ్యాచుల సిరీస్ లో చెరో విజయంతో సిరీస్ ను 1-1తో పంచుకున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిక్యం సాధించడంతో పాటు ముందంజ వేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ కీలకం కానున్నది.