- Home
- Sports
- Cricket
- IPL: అందుకే కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సెన్ కీలక వ్యాఖ్యలు
IPL: అందుకే కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సెన్ కీలక వ్యాఖ్యలు
Virat Kohli: 2013 నుంచి 2021 దాకా.. తొమ్మిదేండ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథిగా వ్యవహరించిన కోహ్లి.. ఉన్నట్టుండి గత సీజన్ రెండో దశకు ముందు...

గతేడాది టీ20 ప్రపంచకప్ నకు ముందు దుబాయ్ లో జరిగిన రెండో దశ ఐపీఎల్ సందర్భంగా అప్పటి ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లి చేసిన ప్రకటన అతడి అభిమానులతో పాటు భారత క్రికెట్ లో కూడా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ లో ఆర్సీబీకి తొమ్మిదేండ్ల పాటు నిరాటంకంగా కెప్టెన్ గా సేవలందించిన కోహ్లి.. అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో అనుమానాలు కూడా తలెత్తాయి. ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక అతడు తర్వాత టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
ఇదిలాఉండగా.. అసలు ఆర్సీబీ సారథిగా కోహ్లి ఎందుకు తప్పుకున్నాడు..? అనే విషయమై అభిమానుల సందేహాలను నివృత్తి చేశాడు ఆ జట్టు డైరెక్టర్ మైక్ హెస్సెన్..
హెస్సెన్ మాట్లాడుతూ... ‘ఈ ఫ్రాంచైజీ (ఆర్సీబీ) కోసం కోహ్లి ఎంత కావాలో అంత చేశాడు. ఆర్సీబీ కోసం ప్రాణం పెట్టి ఆడాడు. అయితే మీరు ఒకపాత్ర నుంచి రాజీనామా చేసినప్పుడు మీకు విరామం కావాలని స్పష్టంగా తెలుస్తుంది. కోహ్లి కూడా అదే కావాలనుకున్నాడు.
తనకు విరామం కావాలని కోహ్లి మాతో చెప్పాడు. ఆర్సీబీలో సీనియర్ ఆటగాడిగా.. బ్యాటర్ గా కొనసాగుతానని, ఆ సమయాన్ని తాను ఆస్వాదించాలనుకుంటున్నట్టు మాకు తెలిపాడు. మేము కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తాము...’ అని తెలిపాడు.
అలాగే కోహ్లి నిష్క్రమణతో కొత్త కెప్టెన్ గురించి తాము కోహ్లితో మాట్లాడామని హెస్సెన్ చెప్పాడు. ‘మేము కొత్త నాయకత్వం గురించి కోహ్లితో చర్చించాం. డుప్లెసిస్ ను సారథిగా చేయడంపై అతడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు..’ అని చెప్పాడు.
ఆర్సీబీ లో విరాట్ ఒక ప్రమాణాన్ని నెలకొల్పాడని, దానిని రీచ్ కావడం ఎవరితరమూ కాదని హెస్సెన్ తెలిపాడు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ లో టాప్-5 బ్యాటర్లలో అతడు కూడా ఒకడని కొనియాడాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేకపోవడంతో కోహ్లి ఈసారి ఆర్సీబీ తరఫున మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందని హెస్సెన్ అభిప్రాయపడ్డాడు.