సెంచరీతో దుమ్మురేపిన తెలుగమ్మాయి.. ఎవరీ 19 ఏళ్ల గొంగడి త్రిష?
Gongadi Trisha: మహిళల అండర్ 19 ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు అదరగొడుతోంది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగమ్మాయి గొంగడి త్రిష సూపర్ సెంచరీతో టీమిండియాకు సూపర్ విక్టరీ అందించడంతో పాటు కొత్త రికార్డులు సాధించింది.

Gongadi Trisha, ICC Under 19 Womens T20 World Cup 2025
Gongadi Trisha: అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై టీమిండియా 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ఇప్పటికే తదుపరి రౌండ్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో పాటు ఆయుషి శుక్లా కూడా తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది.
Gongadi Trisha, ICC Under 19 Womens T20 World Cup 2025
భారత్ ధనాధన్ బ్యాటింగ్
టాస్ గెలిచిన స్కాట్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌కు దిగగా, ఓపెనర్లు జి కమలిని, గొంగడి త్రిషలు శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 42 బంతుల్లో 51 పరుగులు చేసి కమలిని ఔట్ అయింది. తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. ఆమె అవుట్ అయిన తర్వాత, జీ.త్రిష చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండి అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపారు.
Gongadi Trisha, ICC Under 19 Womens T20 World Cup 2025
తెలుగమ్మాయి త్రిష అద్భుత సెంచరీతో రికార్డుల మోత
తెలుగమ్మాయి గొంగడి త్రిష సూపర్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 59 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేసింది. 186.44 స్ట్రైక్ రేట్‌తో కొనసాగిన త్రిష ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 మహిళల ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రీడాకారిణిగా త్రిష చరిత్ర సృష్టించారు. గతంలో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జీఈ స్క్రీవెన్స్ పేరిట ఉండేది. 2023లో ఐర్లాండ్‌పై 93 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. ఈ రికార్డు భారత జట్టు పేరిట మాత్రమే ఉంది. 2023లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై భారత్ 219 పరుగులు చేసింది.
Gongadi Trisha
బౌలింగ్‌లోనూ భారత జట్టు అద్భుతం చేసింది
బ్యాటింగ్ లో దుమ్మురేపిన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. కేవలం 14 ఓవర్లలో స్కాట్లాండ్‌ను 58 పరుగులకే ఆలౌట్ చేసింది. స్కాట్లాండ్‌కు చెందిన నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు పిప్పా కెల్లీ, ఎమ్మా వాల్‌సింగమ్‌ల బ్యాట్‌ల నుండి అత్యధిక పరుగులు వచ్చాయి. ఇద్దరూ 12-12 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. బ్యాట్ తో సెంచరీ కొట్టిన త్రిష బౌలింగ్ లో కూడా అదరగొట్టింది. త్రిష మూడు వికెట్లు పడగొట్టింది. అలాగే, ఆయుషి శుక్లా కూడా 3 ఓవర్లలో 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.
Gongadi Trisha, ICC Under 19 Womens T20 World Cup 2025
ఎవరీ గొంగడి త్రిష?
తెలుగమ్మాయి గొంగడి త్రిష తెలంగాణలోని భద్రాచలంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసు నుంచే తండ్రి ఆమెను క్రికెట్ ఆడటం నేర్పించారు. కేవలం తొమ్మిదేళ్ల వయసులో ఆమె హైదరాబాద్ అండర్-16 జట్టులో భాగమైంది. ఆ తర్వాత అండర్-23 కూడా ఆడింది. త్రిష తన సక్సెస్ క్రెడిట్ తన తండ్రికి ఇచ్చింది. గంటల తరబడి వారితో కష్టపడి పనిచేస్తాడు, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు మలేషియాలో జరుగుతున్న ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ఆటతో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తోంది.