ఆ రోజు రవీంద్ర జడేజాని కొట్టాలనిపించింది... షాకింగ్ విషయం బయటపెట్టిన రోహిత్ శర్మ...
భారత జట్టు ప్లేయర్లలో రవీంద్ర జడేజాకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు క్రేజీ క్రేజీ హెయిర్ స్టైల్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు జడ్డూ. రవీంద్ర జడేజాతో తనకి వ్యక్తిగతంగా కలిగిన ఓ వింత అనుభవాన్ని బయటపెట్టాడు రోహిత్ శర్మ.
‘రవీంద్ర జడేజా చాలా క్రేజీ పర్సన్. అతనితో మీరు ఎప్పుడూ, ఎక్కడికి వెళ్లడానికి సాహసం చేయకూడదు. ఎందుకంటే అతను తన క్రేజీనెస్‌తో మనల్ని ఎప్పుడు ఎలాంటి రిస్క్‌లో పడేస్తాడో చెప్పలేం...
ఓసారి నేను, రహానే, రవీంద్ర జడేజా మా భార్యలతో కలిసి సౌతాఫ్రికా టూర్‌లో ఓ సారి జంగిల్ సఫారీకి వెళ్లాం. అప్పుడు రవీంద్ర జడేజా చేసిన పని, నేను ఎప్పటికీ మరిచిపోలేను...
అడవిలో ఓ చోట రెండు చిరుత పులులు, ఏదో జంతువును వేటాడి తింటున్నాయి. చిరుతలు తింటున్నప్పుడు వాటిని డిస్టర్బ్ చేయకూడదు. చేశామో అవి బాగా చిరాకు తెచ్చుకుని, ఆగ్రహానికి గురై దాడి చేస్తాయి.
అయితే రవీంద్ర జడేజా మాత్రం వింత వింతగా పెద్దగా అరుస్తూ, వాటిని పిలవడం మొదలెట్టాడు. నేను వద్దని చెబుతున్నా, వినకుండా అరుస్తున్నాడు. అతని అరుపులకు చిరుతలు మా వైపు తిరిగి చూశాయి.
ఆ క్షణం ఏదో రిస్క్ ముంచుకురాబోతుందని నాకు అనిపించింది. జడేజా వైపు కోపంగా చూశాను. అతను అర్థం చేసుకుని అరవడం ఆపేశాడు. ఆ రోజు అతన్ని కొట్టాలనిపించేంత కోపం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ.
రోహిత్ శర్మ భార్య రితికా, అజింకా రహానే భార్య రాధిమా మంచి స్నేహితులు. ఈ ఇద్దరు క్రికెటర్లతో చనువుగా ఉండే రవీంద్ర జడేజా కూడా 2018 సౌతాఫ్రికా టూర్‌లో వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్లినప్పుడు జరిగిందీ సంఘటన.
అంతకుముందే గుజరాత్‌లో ఓ అడవిలో సింహంతో కలిసి సెల్పీ ఫోటో దిగి, అక్కడ ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాడు రవీంద్ర జడేజా.