- Home
- Sports
- Cricket
- ఫార్మాట్ ఏదైనా సరే.. ప్రపంచంలో ఆ ఇద్దరి బౌలింగ్ కు ఎదురే లేదు : టీమిండియా పేస్ ద్వయంపై వీరూ కామెంట్స్
ఫార్మాట్ ఏదైనా సరే.. ప్రపంచంలో ఆ ఇద్దరి బౌలింగ్ కు ఎదురే లేదు : టీమిండియా పేస్ ద్వయంపై వీరూ కామెంట్స్
ENG vs IND: ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు భారత పేసర్లు. వీరి బౌలింగ్ మెరుపులతో ది ఓవల్ లో జరిగిన తొలి వన్డే లో భారత జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లాండ్ ను టీ20లలో 1-2తో మట్టికరిపించిన ఇండియా.. వన్డేసిరీస్ లో కూడా శుభారంభమే చేసింది. ది ఓవల్ లో జరిగిన తొలి వన్డే లో భారత జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ప్రసిధ్ కృష్ణ లు చెలరేగడంతో ఇంగ్లాండ్ కు భంగపాటు తప్పలేదు.
ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు భారత పేసర్లు. తాను వేసిన తొలి ఓవర్ నాలుగోబంతికే బుమ్రా.. జేసన్ రాయ్ ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత బంతికే జో రూట్ ను డకౌట్ చేశాడు.
ఇక షమీ కూడా తన రెండో ఓవర్లో బెన్ స్టోక్స్ ను వెనక్కి పంపాడు. తన మూడో ఓవర్లో బుమ్రా లివింగ్ స్టోన్ తో పాటు బెయిర్ స్టో లను పెవిలియన్ కు పంపి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.
మధ్య లో ఇన్నింగ్స్ నిలబెట్టడానికి మోయిన్ అలీ, జోస్ బట్లర్ ప్రయత్నిస్తున్నతరుణంలో ప్రసిధ్ కృష్ణ అలీని వెనక్కి పంపాడు. మళ్లీ షమీ బౌలింగ్ కు వచ్చి జోస్ బట్లర్ ను కూడా డగౌట్ కే చేర్చాడు. ఇక చివరి రెండు వికెట్లు కూడా బుమ్రా ఖాతాలోనే పడ్డాయి.
ఈ క్రమంలో బుమ్రా 6వికెట్లు, షమీ 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ కు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లాండ్ పై టీమిండియా ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా-షమీ లను వీరూ ప్రశంసల్లో ముంచెత్తాడు.
Virender Sehwag
మ్యాచ్ అనంతరం వీరూ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్.. ఫార్మాట్ ఏదైనా అనండి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఈ ఇద్దరినీ మించిన జోడి లేదు. బుమ్రా-షమీ మీరొక అద్భుతం..’ అని పోస్టు పెట్టాడు. ఈ పోస్టులో బుమ్రా-షమీ ల ఫోటో ను కూడా వీరూ షేర్ చేశాడు.
ఇక నిన్నటి మ్యాచ్ లో 6/19 గణాంకాలు నమోదు చేయడం ద్వారా బుమ్రా పలు రికార్డులు బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. వన్డేలతో పాటు ఏ ఫార్మాట్ లో అయినా బుమ్రాకు ఇవే అత్యుత్తమ గణాంకాలు. మరోవైపు షమీ.. అతి తక్కువ మ్యాచులలో 150 వికెట్లు (వన్డేలలో) తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. గతంలో అజిత్ అగార్కర్ (97 మ్యాచులు) పేరిట ఈ
రికార్డు ఉండేది. కానీ షమీ 80 మ్యాచులలోనే ఆ ఘనత సాధించాడు.