- Home
- Sports
- Cricket
- Umran Malik: అంతకుమించిన ఆనందమేముంది..? టీమిండియాలోకి ఉమ్రాన్ రాకపై తండ్రి భావోద్వేగం
Umran Malik: అంతకుమించిన ఆనందమేముంది..? టీమిండియాలోకి ఉమ్రాన్ రాకపై తండ్రి భావోద్వేగం
India Squad For SA T20I: ఐపీఎల్ లో అదరగొట్టి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు.

ఐపీఎల్-15 సీజన్ లో తన సంచలన ప్రదర్శనతో దేశమంతా తనవైపునకు చూసేలా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ భారత జట్టులోకి వచ్చాడు. ఆదివారం జాతీయ సెలెక్టర్లు దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల జాబితాలో ఉమ్రాన్ కూడా ఉన్నాడు.
కాగా తన కొడుకు పేరు జాతీయ జట్టులో చూసేసరికి ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు. తన కొడుకు దేశం తరఫున ఆడుతున్నాడని, ఇంతకుమించిన ఆనందం ఇంకోటి ఏముండదని వ్యాఖ్యానించాడు. అబ్దుల్ రషీద్.. జమ్మూ వీధుల్లో పండ్లు, కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తాడన్న విషయం తెలిసిందే.
ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలోకి ఎంపికైన సందర్బంగా ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘నా కొడుకు జాతీయ జట్టుకు ఎంపికైన విషయం నేను ఇంటర్నెట్ లో చూశాను. అది తెలియగానే నా దగ్గరికి చాలా మంది వచ్చి అభినందిస్తున్నారు.
దేశం తరఫున ఆడటం కంటే పెద్ద విషయమేముంటుంది..? ఉమ్రాన్ మా అందరినీ గర్వపడేలా చేశాడు. ఐపీఎల్ లో తన బౌలింగ్ తో దేశాన్ని తన వైపునకు తిప్పుకుని మాకు గర్వకారణంగా నిలిచాడు. కుటుంబముగా మేము అతడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
నా కొడుకుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుండటం మాకు చాలా ఆనందంగా ఉంది. అతడు తన ప్రతిభనే నమ్ముకుని ఇక్కడిదాకా చేరుకున్నాడు. అందుకోసం ఎంత కష్టపడ్డాడో మాకు మాత్రమే తెలుసు. ఆ కష్టమే ఇప్పుడు అతడి విజయాలకు ప్రతిఫలంగా మారింది.
నా కొడుకు భారత జట్టుకు ఎంపికవడం మా అందరినీ గర్వకారణం. నా కొడుకు దేశం తరఫున ఎంట్రీ ఇచ్చిన రోజు నేను, అతడి అమ్మ (ఉమ్రాన్ తల్లి) నా కొడుకును ఉత్సాహపరిచేందుకు స్టాండ్స్ లో ఉంటాం. కానీ ఇప్పటికైతే నన్ను దయచేసి విడిచిపెట్టండి.. నా కొడుకు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు అని చెప్పాడు. ఏమనుకోవద్దు..’ అని రషీద్ తెలిపాడు.
జమ్మూ లో ఓ పండ్ల దుకాణం నడుపుతున్న రషీద్.. తన కొడుకు కలను కలగా ఉంచకుండా అతడికి మద్దతునిచ్చాడు. క్రికెటర్ గా కొడుకు కెరీర్ ను సక్రమంగా ఉండేందుకు ఎన్నో త్యాగాలకు ఓర్చాడు. ఉమ్రాన్ కూడా నేల విడిచి సాము చేయకుండా ఒదిగి ఉండి తన తల్లిదండ్రులకు గర్వకారణమయ్యాడు.