- Home
- Sports
- Cricket
- వచ్చేవారికి స్వాగతం.. రానోళ్లను బతిలాడం : ఇండియాకు రానంటున్న పాక్‌కు అనురాగ్ ఠాకూర్ కౌంటర్
వచ్చేవారికి స్వాగతం.. రానోళ్లను బతిలాడం : ఇండియాకు రానంటున్న పాక్‌కు అనురాగ్ ఠాకూర్ కౌంటర్
వచ్చే వన్డే ప్రపంచకప్ లో ఆడేందుకు గాను భారత్‌కు రానంటున్న పాకిస్తాన్ కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనరాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రానోళ్ల గురించి తాము పట్టించుకోమని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

2023లో జరగాల్సిన ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశమే లేదని ఇటీవలే వ్యాఖ్యానించిన బీసీసీఐ సెక్రటరీ జై షా కామెంట్స్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఘాటుగానే స్పందించింది. ఇదే విషయమై పీసీబీ కూడా గట్టిగానే స్పందించింది. ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ కు రాకుంటే తాము కూడా వచ్చే ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే ప్రపంచకప్ ఆడబోమని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. వచ్చే వన్డే ప్రపంచకప్ లో ఆడేందుకు పాకిస్తాన్ రాదన్న వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. తాము రానివారి గురించి పట్టించుకోమని తెలిపారు.
తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ లో భద్రతాపరమైన సమస్యలున్నందున ఈ విషయం (ఆసియా కప్ కోసం భారత్ పాక్ కు వెళ్లడం) లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇది కేవలం క్రికెట్ తో ముడిపడి ఉన్న అంశం కాదు..
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కూడా పాకిస్తాన్ పర్యటించినట్టుగా చెబుతున్నారు. కానీ ఆ దేశాలను భారత్ తో పోల్చొచ్చా..? మేం పాకిస్తాన్ కు వెళ్లాలా..? వద్దా..? అనేది ఎవరో చెబితే వినే పరిస్థితుల్లో లేదు. ఇక వన్డే ప్రపంచకప్ కోసం మేం అందరినీ ఆహ్వానిస్తాం. ప్రపంచకప్ ఆడాలనుకునేవాళ్లు రావాలనుకుంటే రావొచ్చు..’అని తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్.. గంగూలీ కంటే ముందు బీసీసీఐగా అధ్యక్షుడిగా ఉన్నవారే. ప్రస్తుతం ఆయన సోదరుడు అరుణ్ ధుమాల్ బీసీసీఐలో కీలక పదవిలో ఉన్నాడు.
ఇదిలాఉండగా భారత జట్టు వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడటానికి వెళ్లకపోయినా మనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ వన్డే ప్రపంచకప్ కు పాకిస్తాన్.. భారత్ కు రాకుంటే అది దాని మనుగడకే ముప్పు. ఆర్థికపరమైన సమస్యలను పక్కనబెడితే ఈ విషయాన్ని ఐసీసీ అంత ఈజీగా తీసుకోదు.
అంతేగాక ఐసీసీని కంట్రోల్ చేసే సామర్థ్యం బీసీసీఐకి ఉన్నందున అది పాకిస్తాన్ కు నష్టనివారణ చర్యలు చేయగలదని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా వాపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది.