సచిన్ తల పగలగొడదామనుకున్నా : షోయభ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
Sachin Tendulkar: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, పాకిస్తాన్ పేసర్ షోయభ్ అక్తర్ మధ్య సమరం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉండేది. ఈ ఇరువురి మధ్య ఆధిపత్యం చేతులు మారినా క్రికెట్ అభిమానులకు మాత్రం అసలు సిసలు మజా దక్కేది.

90, 2000 దశకంలో క్రికెట్ లో అత్యంత ఆసక్తికర సమరాల్లో సచిన్-అక్తర్ పోటీ ఎప్పుడూ రసవత్తరంగా ఉండేది. పలు మార్లు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యం చేతులు మారింది. అయితే సచిన్ ను ఔట్ చేయడం వీలుకాకపోయినప్పుడు తాను అతడిని గాయపరచడానికైనా ప్రయత్నించేవాడినని అక్తర్ వ్యాఖ్యానించాడు. తాజాగా అతడు ఇదే విషయమై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అక్తర్ మాట్లాడుతూ.. ‘నేను ఇది మొదటిసారి బయటకు చెబుతున్నా. ఓసారి నేను సచిన్ ను తీవ్రంగా గాయపరుద్దామనుకున్నా. ఏదేమైనా సరే... హెల్మెట్ కు తగిలేలా బౌన్సర్లు విసిరి సచిన్ రక్తం కళ్ల చూడాలనుకున్నా.
మా కెప్టెన్ ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి వికెట్ల ముందు బంతులు వేయాలని కోరేవాడు. కానీ నా ఇంటెన్షన్ మాత్రం వేరుగా ఉండేది. సచిన్ ను ఇవాళ ఎలాగైనా గాయపరచాలని నేను ఫిక్స్ అయ్యా..
అయితే సచిన్ మాత్రం నేను వేసిన బౌన్సర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా లిటిల్ మాస్టర్ హెల్మెట్ కు బంతిని తాకించలేకపోయా. నేనేంత ట్రై చేసినా విఫలమయ్యాను.
కానీ అప్పటికే భారత జట్టు మహ్మద్ అసిఫ్ బౌలింగ్ మాయకు కుదేలైంది. ఆ రోజు అసిఫ్ గొప్ప బౌలింగ్ చేశాడు.. అటువంటి ప్రదర్శనను నేను గతంలో ఎప్పుడూ చూడలేదు..’ అని తెలిపాడు.
Sachin Tendulkar, Shoaib Akhtar
2006 లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుటి సంఘటన ఇది. కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన టెస్టు గురించి అక్తర్ మాట్లాడాడు. ఈ టెస్టులో భారత జట్టు 341 పరుగులు తేడాతో ఓటమి పాలైంది.
ఈ టెస్టు అంటే గుర్తుకొచ్చే మరో విషయం ఇర్ఫాన్ పఠాన్. తొలి ఓవర్లోనే ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతడు వేసిన పాక్ తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్ లు డకౌట్ అయ్యారు.