టోర్నీ ప్రారంభం నుంచి మొత్తుకుంటూనే ఉన్నా.. వద్దంటే అతడిని ఆడిస్తున్నారు.. దినేశ్ కార్తీక్‌పై వీరూ కామెంట్స్
T20 World Cup 2022: టీమిండియా రెండు వరుస విజయాలు సాధించినప్పుడు కనబడని లోపాలన్నీ ఒక్క ఓటమితో బయటపడ్డాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓడటం ద్వారా పలువురు ఆటగాళ్ల మెడపై కత్తి వేలాడుతున్నది.
టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ మీద గెలిచినప్పుడు పొగిడిన వాళ్లంతా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. టీమిండియాలో లోపాల గురించి తాము మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ముఖ్యంగా టీమ్ సెలక్షన్ పై భారత క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. ఓపెనర్ కెఎల్ రాహుల్ వైఫ్యలం తో పాటు వికెట్ కీపర్ గా బరిలోకి దిగుతున్నదినేశ్ కార్తీక్ కూడా విఫలమవుతుండటంతో మాజీ క్రికెటర్లంతా మూకుమ్మడిగా టీమిండియా టీమ్ సెలక్షన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దినేశ్ కార్తీక్ బదులు వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను ఆడించాలని సూచిస్తున్నారు.
ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘నేను టోర్నీ ప్రారంభం నుంచి చెబుతూనే ఉన్నా. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్ లపై రిషభ్ పంత్ కు ఆడిన అనుభవముంది. అతడు అక్కడ టెస్టులతో పాటు వన్డేలు కూడా ఆడాడు. అక్కడ మంచి ప్రదర్శనలిచ్చాడు.
దినేశ్ కార్తీక్ చివరిసారి ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఆడాడు..? బౌన్సీ వికెట్ల మీద అతడు ఆడాడా..? ఇదేమీ బెంగళూరు వికెట్ కాదు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు ముందు కూడా నేను ఇదే చెప్పా. దీపక్ హుడా కాకుండా జట్టులోకి రిషభ్ పంత్ ను తీసుకోవాలని.. ఆస్ట్రేలియాలో పంత్ కు ఆడిన అనుభవముంది. పంత్ గబ్బా టెస్టులో ఆడిన ఇన్నింగ్స్ ఒక లెజెండరీ ఇన్నింగ్స్ తో సమానం. అటువంటి ఆటగాడిని మీరు బెంచ్ లో కూర్చోబెడుతున్నారు..
అయితే నేను నా అభిప్రాయం మాత్రమే చెబుతున్నాను. తుది జట్టులో ఎవరిని ఆడించాలనేది టీమ్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. కార్తీక్ ఫిట్ గా ఉంటే అతడిని తీసుకుంటే తప్పులేదు. కానీ నా వరకైతే నేను రిషభ్ పంత్ తుది జట్టులో ఉంటేనే బెటర్..’ అని వీరూ అభిప్రాయపడ్డాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టీమిండియా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన తరుణంలో దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఇంకా బాదడానికి పది ఓవర్లు ఉన్నా.. ఇన్నింగ్స్ పునర్నిర్మిస్తున్న సూర్య తో కలిసి నెమ్మదిగా ఆడినా బాగుండేది. కానీ అతడు మాత్రం.. 15 బంతుల్లో 6 పరుగులే చేసి భారీ షాట్ ఆడబోయి నిష్క్రమించాడు.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా కార్తీక్ ఆఖరి ఓవర్లో అనవసర షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత కార్తీక్ కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమేనన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. వీరూతో పాటు కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలంతా తుది జట్టులో పంత్ ను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.