- Home
- Sports
- Cricket
- అతడిలా మెతకగా ఉంటే విరాట్ కోహ్లి అన్ని పరుగులు చేసేవాడు కాదు : భజ్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అతడిలా మెతకగా ఉంటే విరాట్ కోహ్లి అన్ని పరుగులు చేసేవాడు కాదు : భజ్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Harbhajan Singh About Virat Kohli: భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లి దూకుడు కారణంగానే అతడు ఇన్నాళ్లుగా వేలాది పరుగులు చేస్తున్నాడని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు మారుపేరు. భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. జట్టుకు దూకుడును పరిచయం చేస్తే విరాట్ దానిని మరో లెవల్ కు తీసుకెళ్లాడు.
అయితే ఆ దూకుడు కారణంగానే కోహ్లి ఇన్నాళ్లుగా రాణిస్తున్నాడని, మెరుగైన ప్రదర్శనలతో భారత జట్టుకు విజయాలు అందిస్తున్నాడని ఇటీవలే భారత జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు.
ఒకవేళ అతడు దూకుడుగా కాకుండా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని లా ఉంటే ఇన్ని పరుగులు చేసేవాడు కాదని భజ్జీ చెప్పాడు.
హర్భజన్ మాట్లాడుతూ.. ‘జట్టును ముందుకు తీసుకెళ్లడానికి మనకు అతడిలాంటి ఆటగాళ్లు అవసరం.. సాధారణంగా గతంలో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్తే టెస్టు మ్యాచులను ఎలా కాపాడుకోవాలో ఆలోచించేవాళ్లు.
కానీ విరాట్ మాత్రం అలా కాదు. కంగారూల గడ్డ మీద ఆసీస్ ను ఎలా ఓడించాలనే ఆలోచనతో ఉంటాడు.. అందుకే టీమిండియా.. ఆసీస్ లో ఆసీస్ ను రెండు సార్లు ఓడించింది.
కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లో కూడా భాగా ఆడింది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో మనోళ్లు సఫారీలను ఓడించి సిరీస్ దక్కించుకోవాలని ఆశిస్తున్నాను.
ఇక కోహ్లి నాయకుడిగా బాగా రాణిస్తున్నాడు. దూకుడే అతడి విధానం. అది విరాట్ కోహ్లిని అత్యద్భుత ఆటగాడిగా మార్చింది. ఒకవేళ అతడు ఎంఎస్ ధోనిలా మెతకగా ఉండి ఉంటే మాత్రం ఇన్ని పరుగులు చేసి ఉండేవాడు కాదు అని నేను అనుకుంటున్నాను..’ అని హర్భజన్ ముగించాడు.
కాగా.. 33 ఏండ్ల కోహ్లి ఆధునిక క్రికెట్లో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా ప్రూవ్ చేసుకున్నాడు. భారత జట్టు తరఫున 97 టెస్టులాడిన కోహ్లి.. 7,765 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలున్నాయి. టెస్టు బ్యాటింగ్ సగటు 50.65 గా ఉంది.
ఇక వన్డేలలో 254 మ్యాచులు ఆడి.. 12,169 రన్స్ చేశాడు. ఇందులో 43 శతకాలున్నాయి. వన్డేలలో కోహ్లి సగటు 59.07 గా ఉంది. వన్డేలతో పాటు టీ20లలో కూడా కోహ్లి కింగే..
ఇప్పటివరకు 91 అంతర్జాతీయ టీ20 లు ఆడిన విరాట్ 3,216 పరుగులు సాధించాడు. ఇందులో 29 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 94 నాటౌట్.