- Home
- Sports
- Cricket
- ఈ సీజన్ లో అతడు సరిగా ఆడలేదు.. కానీ పుంజుకుంటాడు.. కేకేఆర్ ఓపెనర్ పై మెక్ కల్లమ్ కామెంట్స్
ఈ సీజన్ లో అతడు సరిగా ఆడలేదు.. కానీ పుంజుకుంటాడు.. కేకేఆర్ ఓపెనర్ పై మెక్ కల్లమ్ కామెంట్స్
Venkatesh Iyer: గతేడాది దుబాయ్ లో ముగిసిన ఐపీఎల్-14 రెండో దశలో అసాధారణ ప్రదర్శనతో కోల్కతా నైట్ రైడర్స్ ను ఫైనల్ కు చేర్చడంలో వెంకటేశ్ అయ్యర్ ది కీలక పాత్ర. కానీ ఈ సారి మాత్రం ఆ మ్యాజిక్ ను అతడు రిపీట్ చేయలేకపోతున్నాడు.

గత ఐపీఎల్ సీజన్ లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చి ఆడిన పది మ్యాచులకే భారత జట్టు తలుపు తట్టిన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. గత సీజన్ ప్రదర్శన చూసిన కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం అయ్యర్ కు ఏకంగా రూ. 8 కోట్లు వెచ్చించి రిటెన్షన్ లో దక్కించుకుంది.
గతేడాది దుబాయ్ లో ముగిసిన రెండో దశ ఐపీఎల్ ఓపెనర్ గా వచ్చి దుమ్ము దులపడమే గాక ఆ జట్టు ఫైనల్ కు చేరడంలో కూడా వెంకటేశ్ దే కీలక పాత్ర. అదే మ్యాజిక్ ను ఈ సీజన్ లో కూడా రిపీట్ చేస్తాడని కేకేఆర్ భావించింది.
కానీ ఈ ఏడాది ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. అయ్యర్ పేలవ ఫామ్ ఆ జట్టును బాగా నిరాశపరుస్తున్నది. ఈ సీజన్ లో మొత్తంగా 9 మ్యాచులాడిన అయ్యర్.. 132 పరుగులే చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ. అది పోను అయ్యర్ చేసిన పరుగులు 8 మ్యాచుల్లో 82 మాత్రమే.
అయితే ఈ సీజన్ లో అయ్యర్ సరిగా రాణించలేకపోయినా త్వరలోనే పుంజుకుంటాడని కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
वेंकटेश अय्यर
మెక్ కల్లమ్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ లో వెంకటేశ్ తాను అనుకున్న విధంగా రాణించడం లేదు. ఓపెనర్ గా అతడు విఫలం కావడంతో అతడి బ్యాటింగ్ పొజిషన్ ను కూడా మార్చాం. అయినా అందులో కూడా సక్సెస్ కాలేకపోయాం.
గత సీజన్ లో భాగా ఆడి జాతీయ జట్టుకు ఎంపికైనా ఓ ఆటగాడు ఇప్పుడు ఇలా చతికిలపడుతుండటం అతడికి కూడా నచ్చడం లేదు. కానీ వెంకటేశ్ లో నిజమైన ప్రతిభ దాగుంది. ఇప్పుడు అతడు నెట్స్ లో చెమటోడుస్తున్నాడు.
ఐపీఎల్ లో ఇది వెంకటేశ్ కు రెండో సీజన్ మాత్రమే. ఈ పరిస్థితుల నుంచి అతడు చాలా నేర్చుకుంటాడు. ఈ సీజన్ లో విఫలమైనా త్వరలోనే అతడు పుంజుకుంటాడనే నమ్మకం నాకుంది.. ఇలా విఫలమవడం కూడా అతడి మంచికే జరిగింది. తన ఆటను మెరుగుపరుచుకోవడానికి అయ్యర్ కు ఇది మంచి అవకాశం’ అని తెలిపాడు.
వరుసగా విఫలమవుతుండటంతో అతడిని ఓపెనింగ్ నుంచి తప్పించిన ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దించి చూసినా అయ్యర్ అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో లక్నో తో జరిగిన మ్యాచ్ లో అతడిని తుది జట్టులోకి కూడా ఎంపిక చేయలేదు. ఈ మ్యాచ్ లో కోల్కతా ఏకంగా 75 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.